కర్ణాటక పొలిటికల్ లీగ్ - రసవత్తరం!

Thu May 17 2018 21:47:33 GMT+0530 (IST)

కర్ణాటక పొలిటికల్ లీగ్.. ఆట మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్. అవును... పూర్తి మెజార్టీ లేకపోయినా ప్రభుత్వం ఏర్పరిచిన బీజేపీ దెబ్బ నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ - జేడీఎస్ లు నానా కష్టాలు పడుతున్నాయి. అయినా.. ఐపీఎల్ మాదిరిగా ఇప్పుడు ఎమ్మెల్యేల వేలం పాట మొదలైపోయిందట. దీంతో ఇప్పటికే  ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వేలం పాటలో సేల్ అయినట్లు తెలుస్తోంది.
    
తమకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పుకుంటోన్న జేడీఎస్-కాంగ్రెస్ నేతలు తమ వెంట ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తమ ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఓ రిసార్ట్ కు తరలించగా ఆ రిసార్టు నుంచి.. మస్కి అసెంబ్లీ నియోజక వర్గం ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ కనపడకుండా పోయారు. ఆయన కోసం కాంగ్రెస్ నాయకులు ఎంత ట్రై చేసినా దొరకడం లేదట. బెంగళూరు నగరంలోని హెచ్ ఏఎల్ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేటు విమానంలో ఆయన ఎక్కడికో వెళ్లిపోయారని కాంగ్రెస్ నేతలు చివరకు గుర్తించారు. ఆయన బీజేపీ పంచన చేరిపోయారని టాక్. ఆయన 2013 - 2018లో మస్కి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే అంతకు ముందు 2008లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రతాప్ గౌడ పాటిల్ ను గాలి జనార్దన్ రెడ్డి సోదరుడే విమానం ఎక్కించారని అంటున్నారు. వేలంలో మిగతావారికి కూడా ప్రత్యేక విమానాలు సిద్ధంగా ఉన్నాయట.