Begin typing your search above and press return to search.

రైలు ప్రమాదం వెనుక మావోయిస్టులు ఉన్నారా?

By:  Tupaki Desk   |   22 Jan 2017 9:01 AM GMT
రైలు ప్రమాదం వెనుక మావోయిస్టులు ఉన్నారా?
X
విజయనగరం జిల్లా కొమరాడ సమీపంలో ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగదల్ పూర్ - భువనేశ్వర్ మధ్య తిరిగే హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడం వెనక విద్రోహ చర్య ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ రైలు ఒడిశా - ఛత్తీస్ గఢ్ - ఏపీ ప్రజలకు ముఖ్యమైన రైలు. అయితే.. ప్రయాణ మార్గంలో చాలావరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నుంచే వెళ్తుంది. కూనేరు రైల్వే స్టేషన్ వద్దే ప్రమాదం జరిగింది.. దీంతో తనిఖీలోపాలు వంటివి కారణం కాకపోవచ్చని భావిస్తున్నారు. మావోయిస్టుల హ్యాండ్ ఉండొచ్చని అనుకుంటున్నారు.

హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ ప్రయాణమార్గం చూస్తే చాలావరకు దట్టమైన అటవీ ప్రాంతమే. ముఖ్యంగా ఏవోబీలో మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలే అవి. ఈ రైలు బయలుదేరే ఛత్తీస్ గడ్లోని జగదల్ పూర్ నుంచి మొదలు పెడితే.. ఆ తరువాత అది ఒడిశాలో ప్రవేశించిన తరువాత కోట్ పాడ్ - జయపురం - దమన్ జోడి - కకిరిగుమ్మ - లక్ష్మిపూర్ - రాయగఢ.. ఆ తరువాత ఏపీలోకి వచ్చాక కొమరాడ - పార్వతీపురం - బొబ్బిలి వరకు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నవే. ఇప్పుడు ప్రమాద ప్రాంతం కూడా ఒడిశాను దాటి ఏపీలోకి వచ్చిన తరువాత కొద్ది దూరంలోనే ఉన్న కూనేరు వద్ద జరిగింది. ఇది మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం.

35 మందికిపైగా మృత్యువాత పడిన ఈ ప్రమాదం వెనుక కారణాలు ఇంకా తేలకపోయినా మావోయిస్టుల పనే కావొచ్చని భావిస్తున్నారు. గతంలో మావోయిస్టులు పశ్చిమ బెంగాల్ లో జల్పాయి గురి ప్రాంతంలో రైలును పేల్చేశారు. రీసెంటుగా గత ఏడాది కాన్పూర్ వద్ద జరిగిన భారీ ప్రమాదం వెనుక టెర్రరిస్టులు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో తాజా ప్రమాదం వెనుక మావోయిస్టులు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో టెర్రరిస్టుల ఉనికి లేదు.. ఉన్నదంతా మావోయిస్టులే. రైలు పట్టాలు రెండు చోట్ల విరిగి ఉండటం, అర్థరాత్రి ప్రమాదం జరగడం వంటివి అనుమానాలకు తావిస్తున్నాయి. అయితే.. స్టేషన్ సమీపంలోనే జరగడం వల్ల అది సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరోవైపు అదే నిజమైతే మావోయిస్టుల నుంచి ఈసరికి ప్రకటన వచ్చేదన్న వాదనా వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/