Begin typing your search above and press return to search.

మావోయిస్టు అగ్రనేతతో మైండ్ గేమ్

By:  Tupaki Desk   |   28 Oct 2016 5:15 PM GMT
మావోయిస్టు అగ్రనేతతో మైండ్ గేమ్
X
భారీ కూంబింగ్‌ లు - ఎన్‌ కౌంటర్లు జరిగిన ప్రతిసారీ ఒక పేరు వినిపిస్తుంది. అది మావోయిస్టు అగ్రనేత ఆర్‌ కె పేరు. నాలుగేళ్ళ క్రితం ఏఓబీలో సాలూరు - జైపూర్‌ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో నక్సల్స్‌ చిక్కినట్టే చిక్కితప్పించు కున్నారు. ఇందులో అగ్రనేత ఆర్‌ కె కూడా ఉన్నారన్న ప్రచారం జరిగింది. అసలు అర్‌ కెను పోలీసులు తీసుకుపోయారంటూ ప్రకటనలు వెలువడ్డాయి. మరోవైపు ఆర్‌ కె తీవ్రంగా గాయపడ్డారంటూ కూడా ప్రచారం మొదలైంది. తీరాచూస్తే అటువంటిదేంలేదని తేలిపోయింది. అలాగే నల్లమల అడవుల్లో భారీ కూంబింగ్‌ సమయంలోకూడా ఆర్‌కె పేరు తెరపైకొచ్చింది. బుర్రా మాధవ్‌ ఎన్‌ కౌంటర్‌ తర్వాత కూడా తరచూ ఆర్‌ కె పేరు వినిపించింది. తాజాగా మల్కనగిరి భారీ ఎన్ కౌంటర్ తరువాత కూడా ఆర్కే ఏమయ్యారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గాయపడి - తప్పించుకున్నారని... పోలీసులు అదుపులో ఉన్నారని భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మావోయిస్టు పార్టీ జాతీయ స్థాయి నేత అయిన ఆర్కే పేరు రాష్ట్రంలో పోలీసులు మావోల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్న ప్రతిసందర్భంలోనూ ఏదోవిధంగా ఆయన పేరు తెరపైకొస్తోంది. తాజాగా మల్కనగిరి ఎన్ కౌంటర్లో పోలీసులు తొలిరోజే పెద్ద సంఖ్యలో మావోయిస్టులను హతమార్చగా... తరువాత కూడా అదే ప్రాంతాంలో వరుస రోజుల్లో ఎన్ కౌంటర్లు చేస్తున్నారు. దీంతో తొలి రోజున పట్టుకున్న వారినే అలా హతమారుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆర్కే కూడా అదుపులో ఉంటే ఆయనకూ హాని తలపెడతారంటూ పౌరహక్కుల సంఘం నేతలు వరవరరావు - హరగోపాల్‌ లు అంటున్నారు.

ఆ క్రమంలోనే ఆర్కేకు హాని తప్పించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబును హతమారుస్తామంటూ హెచ్చరికలు జారీచేసినట్లుగా చెబుతున్నారు. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునే లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తమ అగ్రనేతను కాపాడుకునే వ్యూహం పన్నినట్లు అంచనాలేస్తున్నారు. ఈ లేఖ ప్రభావంతో ఇప్పటికే ప్రభుత్వంలో కదలికొచ్చింది. ముఖ్యమంత్రి చుట్టూ భారీ భద్రతా వలయాలేర్పాటు చేశారు. ఆయన తో పాటు అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరికి అదనపు రక్షణ కల్పించారు. ప్రభుత్వం తన లక్ష్యాన్ని మార్చుకుని కొద్ది రోజుల్లో ఆర్‌ కెను న్యాయస్థానానికి అప్పగించే ప్రయత్నం చేస్తుందని భావిస్తున్నారు.

అయితే... ఆర్కే చాకచక్యం తెలిసినవారు మాత్రం ఆయన బలగాలకు దొరక్కపోయి ఉంటారని చెబుతున్నారు. బెటాలియన్ల కొద్దీ పోలీసులు ఆర్కేను చుట్టుముట్టడానికి వచ్చినప్పుడు కూడా ఆయన సునాయాసంగా తప్పించుకున్న దాఖలాలు ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో ఆర్కే మూడుసార్లు పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు. ఏఓబిలో కూడా మూడు - నాలుగుసార్లు ఆర్కే తప్పించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగి ఉండచ్చని కొంతమంది భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/