Begin typing your search above and press return to search.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై మావోయిస్టుల హెచ్చ‌రిక

By:  Tupaki Desk   |   17 Oct 2018 7:40 AM GMT
ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై మావోయిస్టుల హెచ్చ‌రిక
X
తెలంగాణ‌లో మావోయిస్టుల అల‌జ‌డి మ‌ళ్లీ మొద‌లైంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాలని ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తూ వారు బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు. తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌ పేరుతో విడుద‌లైన ఈ లేఖ ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న రేకెత్తిస్తోంది.

కేసీఆర్ స‌ర్కారు దోపిడీ, అణిచివేత‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని మావోయిస్టులు త‌మ తాజా లేఖ‌లో పేర్కొన్నారు. ప్ర‌భుత్వం పై పోరాడాలని ప్ర‌జ‌ల‌ను కోరారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెర‌వేర్చ‌లేదంటూ మావోయిస్టులు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

కోదండ‌రాం నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ జ‌న స‌మితి పార్టీపైనా మావోయిస్టులు త‌మ ఆగ్ర‌హాన్ని వెళ్ల‌గ‌క్కారు. ఆ పార్టీ అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన కొన్నిపార్టీల‌తో పొత్తు కుదుర్చుకుంటున్నారంటూ కాంగ్రెస్‌పై కూడా మావోయిస్టులు త‌మ లేఖ‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజాస్వామిక తెలంగాణ సాధ‌నే లక్ష్యంగా త‌మ పోరాటం కొనసాగిస్తామని.. ఆ బాట‌లో ఎదుర‌య్యే ఎన్ని అడ్డంకులనైనా స‌రే ఏరిపారేసేందుకు తాము సిద్ధ‌మ‌ని తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కార్య‌ద‌ర్శి హరిభూషణ్ త‌మ లేఖలో స్పష్టం చేశారు.

మావోయిస్టుల బ‌హిరంగ లేఖ‌తో తెలంగాణ‌లో క‌ల‌క‌లం రేగుతోంది. ఇప్ప‌టికే టీఆర్ఎస్‌, బీజేపీ పార్టీల‌కు చెందిన కీల‌క‌ నేత‌ల‌ను మావోయిస్టులు టార్గెట్ చేసుకున్న‌ట్లు నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ఆప‌ద్ధ‌ర్మ మంత్రి కేటీఆర్‌పై జ‌న‌శ‌క్తి మావోయిస్టులు ఇద్ద‌రు రెక్కీ నిర్వ‌హించారు. వారిని అదుపులోకి తీసుకొని ప్ర‌శ్నించ‌గా.. ప‌లు విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ముంద‌స్తు ఎన్నిక‌లు ముగిసేలోగా రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం సృష్టించేందుకు మావోయిస్టులు వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో తాజా బ‌హిరంగ లేఖ ప్ర‌భుత్వ‌, పోలీసు యంత్రాగం గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తోంది.