Begin typing your search above and press return to search.

అప్పట్లో మన్మోహన్ అంత డేంజర్లో పడ్డారా?

By:  Tupaki Desk   |   27 July 2016 7:01 AM GMT
అప్పట్లో మన్మోహన్ అంత డేంజర్లో పడ్డారా?
X
పదేళ్లు ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ డేంజర్ దరిదాపుల వరకూ వెళ్లి వచ్చారా? అంటే అవుననే చెబుతున్నారు. తాజాగా ఒక మీడియా సంస్థ వెలుగులోకి తీసుకొచ్చిన పాత వ్యవహారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2007లో చోటు చేసుకున్న ఈ ఘటనలో భారత ప్రధానిగా ఉన్న మన్మోహన్ మృత్యుముఖం వరకూ వెళ్లి వచ్చినట్లుగా తెలుస్తోంది. తన అధికారిక పర్యటనలో భాగంగా మన్మోహన్ రష్యాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న విమానం మాస్కోలో ల్యాండ్ అయ్యే సమయంలో తీవ్ర సాంకేతిక లోపం చోటు చేసుకున్న ఉదంతం తాజాగా బయటకు వచ్చింది.

మన్మోహన్ ప్రయాణిస్తున్న విమానం దాదాపు క్రాష్ అయ్యే పరిస్థితి తలెత్తిందని.. అయితే.. ఆఖరినిమిషంలో తీసుకున్న చర్యలు కారణంగా భారీ ముప్పు తప్పినట్లుగా చెబుతున్నారు. ఇదెంత డేంజర్ కండీషన్ అనే దాని గురించి వివరిస్తూ.. పైలెట్లకు పరిస్థితిపై సమాచారం ఇవ్వటంతోపాటు.. కాక్ పిట్ లో వార్నింగ్ లైట్స్ కూడా వెలిగినట్లు చెబుతున్నారు. అందరిలో తీవ్ర ఉత్కంట రేపిన ఈ అంశం గురించిన వివరాలు చెప్పిన మీడియా సంస్థ కథనం ఏమిటంటే.. ‘‘విమానం చక్కగా ల్యాండింగ్ కావటానికి అవసరమైన లోయర్ గేర్.. కొంత ఎత్తులో ఉన్నప్పుడు పని చేయలేదు. రన్ వే మీద విమానం ల్యాండ్ అయ్యే వేళ.. విమాన టైర్లు సున్నితంగా నేలను తాకేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ గ్లైడ్ స్లోప్ ఉంటుంది. అది సరిగా పని చేయకపోవటం.. చివరకు దాన్ని చక్కదిద్దటంతో ఎలాంటి ప్రమాదం లేకుండా విమానం ల్యాండ్ అయ్యింది’’ అని చెబుతున్నారు.

ఈ ఘటన వెనుక ఏదైనా నిర్లక్ష్యం ఉందా అన్న సందేహానికి సమాధానంగా విమానం దిగుతున్నప్పుడు రన్ వేకు తక్కువ ఎత్తులో ఉండటంతో కరెక్టివ్ యాక్షన్ తీసుకోకపోవటం వల్ల ఇలా జరిగి ఉండి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. పెద్ద ముప్పు నుంచి మన్మోహన్ క్షేమంగా బయటపడ్డారని చెప్పాలి.