Begin typing your search above and press return to search.

ప్ర‌త్యేక హోదా పోరు సాగించాల్సిందే! మ‌న్మోహ‌న్‌

By:  Tupaki Desk   |   25 Sep 2016 10:17 AM GMT
ప్ర‌త్యేక హోదా పోరు సాగించాల్సిందే! మ‌న్మోహ‌న్‌
X
రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో తీవ్ర ఆర్థిక స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్న ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల్సిందేన‌ని మాజీ ప్ర‌ధానమంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ సెల‌విచ్చారు. అంతేకాదండోయ్‌... రాష్ట్రానికి ఎన్డీఏ స‌ర్కారు ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించేదాకా ఉద్య‌మాన్ని కొన‌సాగించాల్సిందేన‌ని ఆయ‌న ఏపీ ప్రజ‌లు - పార్టీలకు సూచిస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం పోరు సాగిస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (ఏపీసీసీ)కి పార్టీ అధిష్ఠానం నుంచి సంపూర్ణ మ‌ద్ద‌తు కూడా ఉంటుంద‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. ఈ మేర‌కు నిన్న త‌న‌ను క‌లిసిన ఏపీసీసీ కాంగ్రెస్ పెద్ద‌ల భుజం త‌ట్టిన ఆయ‌న‌... ఉద్య‌మాన్ని కొన‌సాగించాల్సిందేన‌ని పేర్కొన్నారు. వివ‌రాల్లోకెళితే... ఏపీకి ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ పీసీసీ త్వ‌ర‌లోనే ప్ర‌జా బ్యాలెట్ పేరిట ఉద్య‌మాన్ని చేప‌ట్ట‌బోతోంది. ఈ ఉద్య‌మాన్ని అధిష్ఠానం పెద్ద‌ల‌కు వివ‌రించేందుకు నిన్న ఢిల్లీ వెళ్లిన పీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి - రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు - కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం - పీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రుద్ర‌రాజు త‌దిత‌రులు మ‌న్మోహ‌న్ సింగ్ ను క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న అన్యాయాన్ని వారు ఆయ‌న ముందు ఏక‌రువు పెట్టారు. ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పిన ఎన్డీఏ స‌ర్కారు... చివ‌ర‌కు ప్ర‌త్యేక ప్యాకేజీతో స‌రిపెట్టింద‌ని ఆయ‌న‌కు తెలిపారు. జాతీయ హోదా ఉన్న పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్ర‌మే నిర్మించాల్సి ఉన్నా... తానే క‌డ‌తానంటూ రాష్ట్రం కోర‌డం - దానికి కేంద్రం సానుకూలంగా స్పందించ‌డం వెనుక పెద్ద కుట్రే జ‌రుగుతోంద‌ని వారు ఆయ‌న‌కు ఫిర్యాదు చేశారు. క‌మిష‌న్ల కోస‌మే ప్ర‌త్యేక హోదాను కాద‌ని ప్ర‌త్యేక ప్యాకేజీకి రాష్ట్ర ప్ర‌భుత్వం ఒప్పుకుంద‌ని కూడా వారు మ‌న్మోహ‌న్ సింగ్ కు చెప్పారు. పీసీసీ పెద్ద‌లు చెప్పిన విష‌యాన్నంతా సావ‌దానంగా విన్న మ‌న్మోహ‌న్‌... ప్ర‌త్యేక హోదా కోసం చేస్తున్న ఉద్య‌మాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విర‌మించ‌రాద‌ని వారికి సూచించారు. ఈ పోరాటానికి అధిష్ఠానం మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌ని కూడా ఆయ‌న వారికి హామీ ఇచ్చారు.