Begin typing your search above and press return to search.

బీజేపీని షేక్ చేస్తున్న సీబీఐ రచ్చ

By:  Tupaki Desk   |   20 Nov 2018 2:30 PM GMT
బీజేపీని షేక్ చేస్తున్న సీబీఐ రచ్చ
X
విశ్వసనీయతకు మారుపేరునంటూ గద్దెనెక్కిన మోడీ పాలించిన నాలుగున్నరేళ్లలోనే ఎన్నో వివాదాలు కొనితెచ్చుకున్నారు. మోడీ హయాంలోనే దేశంలోని ప్రతిష్టాత్మక వ్యవస్థలన్నీ కుప్పకూలుతుండం దేశాన్ని నివ్వెరపరుస్తోందంటున్నారు విశ్లేషకులు.. గద్దెనెక్కక ముందు ఎన్నో మాటలు చెప్పిన మోడీ.. కేంద్రంలోని స్వతంత్రంగా వ్యవహరించే వ్యవస్థలన్నింటిని కబళిస్తుంటే.. వాటి తాలూకా ఫలితాలు ఇప్పుడు కళ్ల కనపడుతుంటే అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు..

తాజాగా సీబీఐ వ్యవహారం సుప్రీం కోర్టు కు చేరింది. ఇప్పటికే సీబీఐ అధిపతి అలోక్ వర్మ - స్పెషల్ డైరెక్టర్ రాకేషా అస్తానాలపై వచ్చిన అవినీతి ఆరోపణలతో వారిద్దరిని కేంద్రం లీవ్ లో పంపించి తొలగించింది. వారు తమను తొలగించడంపై సుప్రీం లో పోరాడుతున్నారు. కాగా ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. తాజాగా బీజేపీ కేంద్రమంత్రిపై ఆరోపణలు బీజేపీని షేక్ చేస్తున్నాయి.

సీబీఐ డీఐజీ మనీష్ కుమార్ సిన్హా బాంబు పేల్చారు. మెయిన్ ఖురేషీ అనే మాంసం ఎగుమతి దారుడి అక్రమాలపై విచారణ చేస్తున్న ఆయన ఈ విషయంలో స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్తానా ముడుపులు తీసుకున్నాడని ఆరోపించారు. దీనిపై విచారణకు ఆదేశించిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ కూడా ఇందులో ప్రమేయం ఉందని రాకేష్ అస్తానా ఆరోపణలు చేయడంతో సీబీఐ ప్రతిష్ట మసకబారి ఇది దేశవ్యాప్తంగా రచ్చరచ్చ అయ్యింది.

తాజాగా సీబీఐ డీఐజీ మనీష్ కుమార్ సిన్హా కేంద్రమంత్రి హరిభాయ్ కి కూడా ఈ విషయంలో భారీ మొత్తంలో ముడుపులు అందాయని సంచలన నిజాలు బయటపెట్టాడు. ఈ కేసు విషయంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, సతీష్ సానాలు మధ్యవర్తిత్వం నడిపారని ఆరోపించారు. అస్తానాపై విచారణ జరపాలని కోర్టులో పిటీషన్ వేశారు. మంగళవారం కోర్టులో వర్మ పిటీషన్ పై విచారణకు మనీష్ కుమార్ హాజరు కావాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఈ మొత్తం కేసు కీలక మలుపు తిరిగింది.

అయితే మెయిన్ ఖురేషీ కేసులో విచారిస్తున్న సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్ ను సోదాలు చేయకుండా జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ ఆదేశాలిచ్చారని మనీష్ కుమార్ సిన్హా తెలుపడంతో ప్రభుత్వంలో ఇరకాటంలో పడింది. దీంతో నిందితులను కాపాడేందుకు ప్రభుత్వంలోని పెద్దలే రంగంలోకి దిగారని అర్థమైందని వివరించాడు. అలోక్ వర్మ దర్యాప్తు సాగుతుండగానే కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేష్ చంద్ర కూడా కలుగుజేసుకున్నాడని తెలిపాడు. ఇలా సీబీఐలోని అక్రమాల బాగోతంలో జాతీయ భద్రత సలహాదారు, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సహా పెద్ద పెద్ద వారి పేర్లు బయట పడుతుండడం బీజేపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.