Begin typing your search above and press return to search.

ఈ ఐఏఎస్ దేశంలోని అంద‌రికీ ఆద‌ర్శం

By:  Tupaki Desk   |   15 Jun 2018 5:53 PM GMT
ఈ ఐఏఎస్ దేశంలోని అంద‌రికీ ఆద‌ర్శం
X
ప్ర‌భుత్వ అధికారులంటే సాధార‌ణంగా కొంద‌రికి ఓ అభిప్రాయం ఉంటుంది. విప‌త్తులు సంభ‌విస్తే...వారేం ప‌ట్టించుకోర‌ని...ఒక‌వేళ చేసిన ఏదో తూతూమంత్రంగా చేస్తార‌ని. ఇంకొంద‌రు ప్రకృతి విపత్తులు వచ్చినా.. అనుకోని ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినా.. ప్రజలను ఓదార్చడానికి, వాళ్లు తగిన సౌకర్యాలు కల్పించడానికి అధికారులు ఆయా ప్రదేశాలకు వెళ్తుంటారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని రెస్క్యూ సిబ్బంది, ఇతర అధికారులను పురమాయిస్తుంటారు. కాని.. మణిపూర్‌కు చెందిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ మాత్రం చెప్పడం కాదు.. చేసి చూపించాడు. మిగితా అధికారులకు ఆదర్శంగా నిలిచాడు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న ఇప్పుడు హీరో అయ్యారు.

గత కొన్ని రోజులుగా మణిపూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో అధికారులంతా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఫ్లడ్ కంట్రోల్ సెక్రటరీ దిలీప్ సింగ్ కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాడు. కాని.. ఆయన మిగితా వాళ్లకు అలా చేయి, ఇలా చేయి అని చెప్పలేదు. తన నడుం బిగించి సహాయానికి పూనుకున్నాడు. నడుం లోతు నీళ్లలో దిగి మిగితా సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నాడు. ఇక.. ఆయన రెస్క్యూ సిబ్బందితో కలిసి నీళ్లతో దిగి రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్, రాష్ట్ర మంత్రి లెట్‌పావో హావోకిప్, మిగితా మంత్రులు కూడా అక్కడే ఉన్నారు. ఇక.. వాళ్లంతా దిలీప్‌ను హీరో అంటూ పొగిడారు.

నిజానికి ఆ ఫోటోను ముందుగా సోషల్ మీడియాలో షేర్ చేసింది మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ కావ‌డం విశేషం. "రాష్ర్టాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యులు, ముఖ్య కార్యదర్శి, డీజీ, ఐఏఎస్‌లు, సెక్యూరిటీ ఫోర్స్, పర్సనల్ డిపార్ట్‌మెంట్ అంటా కలిసి ఈ ప్రకృతి విపత్తును దైర్యంగా ఎదుర్కొంటున్నారు.." అని పేర్కొన్నారు. దాంతో పాటు రెస్క్యూలో పాల్గొన్న అధికారుల ఫోటోను సీఎం ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో దిలీప్ ఫోటో కాస్త వైరల్‌గా మారింది. ఆ ఫోటోను బాలీవుడ్ సెలబ్రిటీ బొమన్ ఇరానీ కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు." ప్రజల కోసం సేవ చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ దిలీప్ సింగ్‌కు హ్యాట్యాఫ్" అంటూ ఇరానీ ట్వీట్ చేశాడు. ఇలా ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచిన దిలీప్‌సింగ్‌ను మ‌ణిపూర్ వాసులు త‌మకు ద‌క్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు.