Begin typing your search above and press return to search.

ద‌ళిత సెంటిమెంట్‌ను బ‌య‌ట‌కు తీసిన మంద‌కృష్ణ‌

By:  Tupaki Desk   |   28 July 2015 9:30 AM GMT
ద‌ళిత సెంటిమెంట్‌ను బ‌య‌ట‌కు తీసిన మంద‌కృష్ణ‌
X
ఉద్య‌మ రాజ‌కీయాల్లో పండిపోయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు త‌న వాద‌న‌తో కాస్తంత ఇబ్బంది పెట్టే ఉద్య‌మ‌నేత ఎవ‌రైనా ఉన్నారా అంటే అది ద‌ళిత‌నేత మంద‌కృష్ణ మాదిగే. ఉద్య‌మ రాజ‌కీయాల్ని న‌డ‌ప‌టంలో ఈ ఇద్ద‌రిది భిన్న‌మైన‌ద‌న్న విష‌యం మ‌ర్చిపోకూడ‌దు. ప్రాంతీయ ఉద్య‌మాన్ని కేసీఆర్ న‌మ్ముకుంటే.. ద‌ళిత ఉద్య‌మాన్ని మంద‌కృష్ణ న‌మ్మారు.

భిన్న ధ్రువాలైన వీరిద్ద‌రూ ఉద్య‌మ రాజ‌కీయాల్లో మాత్రం ఎవ‌రిని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌లేం. తాను న‌మ్మిన తెలంగాణ వాదంతో కేసీఆర్ ఏం సాధించార‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక‌.. మంద‌కృష్ణ ఉద్య‌మ ప‌రిధి చిన్న‌ది కావ‌టంతో ఆయ‌న ప్ర‌భావాన్ని పెద్ద‌గా చూపించ‌లేద‌నాలి. త‌న ఉద్య‌మాన్ని రాజ‌కీయ శ‌క్తిగా మ‌ల‌చ‌టంలో మంద‌కృష్ణ స‌క్సెస్ కాలేదు. అలా అని ఆయ‌న్ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌లేని ప‌రిస్థితి. ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ ఆయ‌న త‌న ఉద్య‌మాల‌తో ప్ర‌భుత్వాల‌కు నిద్ర ప‌ట్ట‌కుండా చేసిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అయితే.. ఉద్య‌మాల ద్వారా ఆయ‌న సాధించింది త‌క్కువే.

కానీ.. ఆయ‌న ఏ రోజు గ‌ళం విప్పినా.. ఏ రోజు ఆందోళ‌న‌ల‌కు సై అన్నా.. ఉద్య‌మ వేడి నిమిషాల్లో పీక్ స్టేజ్‌ కి తీసుకెళ్లేలా చేయ‌గ‌ల నేర్పు మంద‌కృష్ణ సొంతం. తాజాగా ఆయ‌న జీహెచ్ ఎంసీ కార్మికుల స‌మ్మెకు మ‌ద్ధ‌తు ప‌ల‌క‌ట‌మే కాదు.. కొత్త కోణాన్ని బ‌య‌ట‌కు తీశారు. విధుల నుంచి తొల‌గించిన పారిశుద్ధ్య కార్మికుల్ని తిరిగి ప‌నిలోకి తీసుకోవాలన్న నినాదంతో నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న శిబిరాన్ని సంద‌ర్శించిన మంద‌కృష్ణ‌.. ఈ వ్య‌వ‌హారంలో కొత్త కోణాన్ని ఆవిష్క‌రించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. మొద‌ట మోసం చేసింది ద‌ళితుల్నే అని వ్యాఖ్యానించారు. తెలంగాణ వ‌స్తే.. ద‌ళితుడ్ని ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని ప్ర‌క‌టించిన‌.. అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌నే సీఎం ప‌ద‌విని చేప‌ట్టిన విష‌యాన్ని గుర్తు చేవారు. ఇక‌.. ద‌ళితుడైన ఉప ముఖ్య‌మంత్రి రాజ‌య్య విష‌యంలోనూ రెండోసారి మోసం చేశార‌న్నారు. ఆయ‌న్ను ఘోరంగా అవ‌మానించి బ‌ర్త‌ర‌ఫ్ చేశార‌న్నారు.

తాజాగా గ్రేట‌ర్ లో పారిశుద్ధ్య కార్మికుల్లో 90 శాతం ద‌ళితులే ఉన్నందున‌.. అప్రజాస్వామికంగా ఉద్యోగాల నుంచి తొల‌గించార‌న్నారు. ద‌ళితుల‌పై కేసీఆర్ క‌క్ష సాధిస్తున్నార‌ని వ్యాఖ్యానించిన మంద‌కృష్ణ‌.. విధుల నుంచి తొల‌గించిన కార్మికుల్ని వెంట‌నే చేర్చుకోవాల‌ని డిమాండ్ చేశారు. మ‌రి.. మంద‌కృష్ణ డిమాండ్‌కు కేసీఆర్ స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.