Begin typing your search above and press return to search.

ఆమె షో అంత‌మంది ప్రాణాలు తీసిందా?

By:  Tupaki Desk   |   23 May 2017 7:11 AM GMT
ఆమె షో అంత‌మంది ప్రాణాలు తీసిందా?
X
ఐసిస్ రాక్ష‌సులు చెల‌రేగిపోయారు. అమెరికాకు చెందిన పాప్ గాయ‌ని.. న‌టి అరియానా గ్రాండే తాజాగా బ్రిట‌న్ లో షోలు చేస్తున్నారు. ఇప్ప‌టికే బ‌ర్మింగ్ హోమ్‌.. డ‌బ్లిన్ లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన అరియానా రేపు ఎల్లుండి లండ‌న్ లో షోలు ఇవ్వాల్సి వ‌చ్చింది. ఆమె షోల‌కు ఎంత డిమాండ్ అంటే.. తాజాగా ఆత్మాహుతి దాడి జ‌రిగిన మాంచెస్ట‌ర్ లోని ఎరీనాలో సామ‌ర్థ్యం 18వేల మంది అయితే.. ఆమె షోకు వ‌చ్చిన వారు 21 వేలు. పెద్ద ఎత్తున వ‌చ్చిన జ‌న‌సందోహం మ‌ధ్య‌లో బాంబు పేల‌టంతో ప్రాణ న‌ష్టం భారీగా జ‌రిగింది. పాపుల‌ర్ పాప్ గాయ‌ని కావ‌టంతో షోకు పెద్ద ఎత్తున జ‌నం వ‌చ్చారు. ఇది కూడా భారీ ప్రాణ న‌ష్టానికి కార‌ణంగా చెబుతున్నారు

త‌న షోలో చోటు చేసుకున్న ఆత్మాహుతి దాడిపై అరియానా తీవ్రమైన షాక్‌ కు గురైంది. త‌న గుండె ప‌గిలింద‌ని.. ఐయామ్ సారీ అని.. త‌న‌కేం చెప్పాలో అర్థం కావ‌టం లేద‌ని.. మాట‌లు రావ‌టం లేద‌ని ఆమె ట్వీట్ చేశారు.
ఐసిస్ ఉగ్ర‌వాదులు చేప‌ట్టిన తాజా ఆత్మాహుతి దాడిని చూస్తే.. రాక్ష‌సుల దుర్మార్గానికి నోట మాట రాదంతే. అరియానా షో ముగిసిన త‌ర్వాత‌.. షోకు వ‌చ్చిన వారు వెళ్లిపోయే వేళ‌లో బాంబును పేల్చ‌టం చూస్తే.. త‌మ దాడికి భారీగా ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గాల‌న్న‌దే ఐసిస్ ల‌క్ష్య‌మ‌న్న‌ది అర్థ‌మ‌వుతుంది.

షో ముగిసి ప్రేక్ష‌కులు బ‌య‌ట‌కు వెళ్లే ఒక ద్వారం వ‌ద్ద బాంబు పెద్ద శ‌బ్దంతో పేల‌టంతో అస‌లేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి. ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌లు చోటు చేసుకొని ప్రాణ‌భ‌యంతో ప్ర‌జ‌లు ప‌రుగులు తీయ‌టం.. ఈ సంద‌ర్భంగా చిన్న‌పిల్ల‌లు కింద‌ప‌డి.. తొక్కిస‌లాట చోటు చేసుకోవ‌టం.. తొక్క‌కుంటూ వెళ్లిపోవ‌టం లాంటి వాటితో భీతావాహ ప‌రిస్థితి నెల‌కొంది. ఇదే ఎక్కువ ప్రాణ న‌ష్టానికికార‌ణంగా చెప్పొచ్చు. నిష్క్ర‌మ‌ణ ద్వారం వ‌ద్ద షోకు వ‌చ్చిన వారు వెళ్లిపోతున్న వారు గుంపుగా ఉండ‌టం.. అక్క‌డే బాంబు పేల‌టంతో ప్రాణాలు భారీగా పోవ‌ట‌మే కాదు.. తీవ్రంగా గాయ‌ప‌డిన వారి సంఖ్య కూడా చాలా ఎక్కువ‌గా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌రోవైపు ఈ దారుణానికి పాల్ప‌డింది తామేన‌ని ప్ర‌క‌టించుకుంది ఐసిస్ రాక్ష‌స మూక‌. ఇది ఆరంభం మాత్ర‌మేన‌ని.. ఇలాంటి దాడులు మ‌రిన్ని చేస్తామంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. శ‌క్తివంత‌మైన నెయిల్ బాంబును పేల్చిన‌ట్లుగా ప్ర‌క‌టించింది. మోసుల్‌ లో జ‌రిగిన దాడుల‌కు ప్ర‌తీకారంగా తాజా చ‌ర్య‌ను అభివ‌ర్ణించింది. మాంచెస్ట‌ర్ పేలుళ్లు విజ‌య‌వంతం కావ‌టం ప‌ట్ల ఐసిస్ మ‌ద్ద‌తుదారులు సంబ‌రాలు చేసుకోవ‌టం గ‌మ‌నార్హం.

ఎరీనా వ‌ద్ద బాంబు పేలుళ్ల అనంత‌రం అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు.. స‌మీపంలోనూ భారీ ఎత్తున గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. వారి ప్ర‌య‌త్నం కార‌ణంగా అక్క‌డికి స‌మీపంలోని కేథ‌డ్ర‌ల్ గార్డెన్‌లోనూ పేలుడు ప‌దార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజా దాడి నేప‌థ్యంలో బ్రిట‌న్ తో స‌హా యూర‌ప్ మొత్తం హైఅలెర్ట్ ప్ర‌క‌టించారు. అమెరికాలోనూ సెక్యూరిటీని టైట్ చేశారు.

ఇక‌.. మాంచెస్ట‌ర్ బాంబు పేలుళ్ల స‌మ‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎక్క‌డ ఉన్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. మాంచెస్ట‌ర్ లో ఆత్మాహుతి దాడి జ‌రుగుతున్న స‌మ‌యంలో ట్రంప్ సౌదీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకొని ఇజ్రాయిల్ కు వెళుతున్న స‌మ‌యంలోనే ఆయ‌న‌కు ఈ విష‌యం తెలిసిన‌ట్లుగా చెబుతున్నారు. విమానంలో ఉన్న స‌మ‌యంలోనే ట్రంప్‌ కు మాంచెస్ట‌ర్ దాడి వార్త తెలిసింద‌ని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న స్పంద‌న ఏమిట‌న్న‌ది బ‌య‌ట‌కు రాలేదు.