Begin typing your search above and press return to search.

మిస్ట‌ర్ క్లీన్ సీఎంపైనా చెప్పులు ప‌డ్డాయే!

By:  Tupaki Desk   |   21 Feb 2018 4:18 PM GMT
మిస్ట‌ర్ క్లీన్ సీఎంపైనా చెప్పులు ప‌డ్డాయే!
X
దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల‌ను వ‌రుస‌లో నిల‌బెట్టి... నీతిమంత‌మైన నేత ఎవ‌రో చెప్పంటి అంటే.. మొత్తం 29 మందిని పూర్తిగా ప‌రిశీలించ‌కుండానే... ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయక్ ను చూపించేస్తాం. ఎందుకంటే... 18 ఏళ్ల క్రితం అంటే... 2000 ఏడాదిలో కేంద్ర మంత్రిగా ఉండ‌గానే ఒడిశా సీఎం ప‌ద‌వి చేతికంద‌డంతో కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి ఒడిశాకు తిరిగి వ‌చ్చేసిన న‌వీన్‌... అప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా అంటే ఏకంగా 18 ఏళ్లుగా ఒడిశాకు సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. న‌వీన్ సీఎంగా ఉండ‌గా ఇప్ప‌టిదాకా నాలుగు ప‌ర్యాయాలు ఎన్నిక‌లు జ‌రిగితే... వాటిన్నింటిలోనూ ప‌ట్నాయ‌న్ ఆధ్వ‌ర్యంలోని బిజూ జ‌న‌తాదళ్ పార్టీ విజ‌య‌ఢంకా మోగించింది. ఇప్ప‌టిదాకా నాలుగు ప‌ర్యాయాలు సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన న‌వీన్‌... వ‌చ్చే ప‌ర్యాయం కూడా త‌న‌కు ఎదురే లేద‌న్న‌ట్లుగా ముందుకు సాగుతున్నారు.

మొన్న‌టికి మొన్న దేశంలోని ధ‌నిక సీఎంలు - పేద సీఎంలు ఎవ‌రు... ఎవ‌రి ఆస్తి ఎంత అన్న వివ‌రాలు బ‌య‌ట‌కు రాగా... టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ధ‌నిక సీఎంల‌లో ఫ‌స్ట్ ప్లేస్‌ లో నిల‌వ‌గా - పేద సీఎంల‌లో న‌వీన్ టాప్‌ లో నిలిచారు. మొత్తంగా సీఎంగా ఉన్నా కూడా ల‌గ్జ‌రీ లైఫ్‌ ను ఏనాడూ కోరుకోని న‌వీన్‌... చాలా సాధార‌ణ జీవితాన్నే గ‌డుపుతార‌ట‌. ఇప్ప‌టికీ న‌వీన్ స‌తీమ‌ణి స్వ‌యంగా బ‌జారుకెళ్లి కూర‌గాయ‌లు తెచ్చుకుంటార‌ట‌. బ‌జారుకెళ్లేందుకు న‌వీన్ స‌తీమ‌ణి ఏ బెంజి కార్లో, మారుతీ కార్లో వినియోగించ‌ర‌ట‌. ఎంచ‌క్కా రిక్షాలోనే ఆమె వెళ్లిపోతార‌ట‌. న‌వీన్ మిస్ట‌ర్ క్లీన్ ఇమేజీకి ఇదో మ‌చ్చు తున‌క అనే చెప్పాలి. ఎంత క్లీన్‌గా ఉన్నా.. రాజ‌కీయాల్లో మ‌ర‌క‌లు ప‌డిపోతూనే ఉంటాయి. అందుకు న‌వీన్ కూడా అతీతులేం కాదనే చెప్పాలి. ఓ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతున్న న‌వీన్‌ పైకి ఓ వ్య‌క్తి ఏకంగా చెప్పులు విసిరివేసిన ఘ‌ట‌న నిన్న‌ చోటుచేసుకుంది.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే.. ఒడిశాలోని బేజీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం నవీన్ పట్నాయక్ మంగళవారం బార్‌ ఘడ్‌ ప్రాంతంలో పర్యటించారు. అనంతరం కుంభారీ గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈసందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియచేశారు. అయితే సభలో ఆయనకు ఊహించని అనుభవం ఎదురైంది. పట్నాయక్‌ మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై చెప్పులు విసిరాడు. వాటి నుంచి సీఎం తప్పించుకున్నారు. దీంతో అప్రమత్తమైన పార్టీ నేతలు - కార్యకర్తలు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని చితకబాదారు. దాడిన చేసిన వ్యక్తి బీజేపీ కార్యకర్తగా గుర్తించారు. అయితే న‌వీన్‌కు ఈ త‌ర‌హా చేదు అనుభవం ఇదే తొలిసారి కాద‌ట‌. ఓ వారం క్రితం కొంద‌రు మ‌హిళ‌లు ఆయ‌న‌పై కోడిగుడ్ల‌తో దాడికి దిగారు. తాజాగా ఏకంగా న‌వీన్ పై చెప్పులు ప‌డిపోయాయి. మొత్తంగా ఎంత క్లీన్ ఇమేజీ ఉన్నా... పాలిటిక్స్‌ లో ఈ త‌ర‌హా చేదు అనుభ‌వాలు త‌ప్ప‌వేమో.