నరబలి కోరిన మోడీ చెన్నై టూర్!

Thu Apr 12 2018 14:26:11 GMT+0530 (IST)

ప్రధాని నరేంద్రమోడీ... ఆందోళనలతో అట్టుడుకుతున్న చెన్నై నగరంలో తన అధికారిక కార్యక్రమం పెట్టుకోవడం అనేది సంయమనం లేని దురాగతమైన చర్యగా ఇప్పుడు ప్రజల దృష్టిలో కనిపిస్తోంది. పరిస్థితులు తమకు వ్యతిరేకంగా ఉద్రిక్తంగా ఉన్నప్పుడు.. వాతావరణం కాస్త శాంతించే వరకు అటువైపు వెళ్లకపోవడమే.. ప్రజల పట్ల చిత్తశుద్ధి శ్రద్ధ ఉన్న నాయకులకు బాధ్యత. సాధారణంగా ఎవరైనా ఇలాంటి లోకరీతిని పాటిస్తారు.కానీ నరేంద్రమోడీ వ్యవహారం ఎంతైనా కాస్త తేడా. తమిళనాడు మొత్తం తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అట్టుడుకుతున్నదని ఆయనకు తెలుసు. అయినా సరే.. ఆయన తమిళనాడులోనే తన అధికారిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పైగా.. తమిళ ఎంపీలు పార్లమెంటులో చేసిన నిరసన దీక్షలకు పోరాటాలకు వ్యతిరేకంగా తాను నిరాహార దీక్ష చేస్తూ.. చెన్నై నగరంలో అధికారిక కార్యక్రమానికి ఆయన హాజరు కావడం విశేషం.

కావేరీ బోర్డు ఏర్పాటు చేయడంలో.. సుప్రీం కోర్టు ఆదేశించిన తర్వాత కూడా.. కేవలం కర్నాటకలో తమ రాజకీయ ప్రయోజనాలను ఈడేర్చుకోవడానికి మోడీ సర్కారు మోసపూరిత వైఖరితో వ్యవహరిస్తూ జాప్యం చేస్తున్నదనే సంగతి అందరూ అంచనా వేస్తున్నదే. అయితే సుప్రీం చెప్పాక కూడా.. కేంద్రంలో కదలిక రాకపోతే ఎలా? అంటూ.. తమిళసీమ మొత్తం మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నది.

ఇలాంటి నేపథ్యంలో.. మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించడమే తప్పు. కానీ.. తన చెంత మిలిటరీ బలం- బలగం ఉన్నది గనుక.. తాను వెళ్తున్నది డిఫెన్స్ కార్యక్రమానికే గనుక.. భద్రతకు ఢోకా ఉండదని మోడీ చెన్నైలో అడుగుపెట్టారు. ఆయన పర్యటనకు నిరసన తెలియజేయాలని ఆందోళన కారులు రెడీగా ఉండగా.. వారి కంటపడకుండా విమానంలోంచి హెలికాప్టర్ లోకి మారి.. ఆయన తుర్రుమన్నారు.

అయితే శోచనీయం ఏంటంటే.. మోడీ తమిళనాడుకు రావడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ఓ ఆందోళన కారుడు ఆత్మాహుతి చేసుకోవడం! ఓ ఆందోళన కారుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మరణించాడు. ఈ ఆత్మాహుతి మోడీ దుడుకుతునం వలన జరిగిన హత్య కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమయౌచిత్యం పాటించకుండా.. మోడీ అలా వ్యవహరించడం కరెక్టు కాదనే వాదన తమిళుల్లో వినిపిస్తోంది.