Begin typing your search above and press return to search.

ఫుడ్ లో వెంట్రుక వచ్చిందని భార్యకు గుండు

By:  Tupaki Desk   |   9 Oct 2019 5:59 AM GMT
ఫుడ్ లో వెంట్రుక వచ్చిందని భార్యకు గుండు
X
భార్యభర్తలన్న తర్వాత అన్యోన్యంగా ఉండటం.. ఒక్క మాట కూడా అనుకోకుండా సంసారం చేయటం సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే వ్యవహారం. ఒక గూటి కింద కాపురం చేసే భార్యభర్తల మధ్య అభిప్రాయభేదాలు.. ఒకరి తీరు ఒకరికి నచ్చకపోవటం లాంటివి కామన్. అయితే..భార్య చేసే ప్రతి పనికి అవసరానికి మించి రియాక్ట్ కావటం కొందరిలో కనిపిస్తుంది. హద్దులు దాటితే ఎవరికైనా ఎంత భర్తకైనా తిప్పలు తప్పవన్న వైనం తాజా ఉదంతాన్ని చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు.

భార్య కారణంగా జరిగిన పొరపాటు విషయంలో ఒక భర్త వ్యవహరించిన దుర్మార్గం అవాక్కు అయ్యేలా చేయటమే కాదు.. ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అన్న విభ్రాంతికి గురి కాక మానదు. తినే తిండిలో మధ్యలో వెంట్రుక వస్తే చిరాకు అనిపించటం మామూలే. అయితే..ఈ కారణంగా ఫుడ్ ను తయారు చేసిన భార్యకు గుండు కొట్టించే దుర్మార్గానికి తెగ బడ్డాడో శాడిస్టు భర్త.

ఈ ఉదంతం మన దేశంలో జరగకున్నా.. భార్యను ఇంత దారుణంగా హింసించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారి.. అన్ని దేశాల్లోనూ వార్తాంశంగా మారింది. బంగ్లాదేశ్ లోని జోయ్ పుర్హత్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల బబ్లూ మొండల్ తినే ఆహారంలో వెంట్రుకలు వచ్చాయి. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు.. ఆమెపై కోపాన్ని ప్రదర్శించాడు. అక్కడితో ఆగకుండా.. బ్లేడు తీసుకొని.. ఆమెకు బలవంతంగా గుండు కొట్టాడు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. మహిళా హక్కుల సంఘాలు రంగంలోకి దిగాయి. భార్యను తీవ్రంగా వేధించిన కేసు కింద ఇతడ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్న ఈ భర్తకు.. తాను చేసిన చెత్త పనికి గరిష్ఠంగా 14 ఏళ్లు జైలుశిక్ష పడే ప్రమాదం ఉందంటున్నారు.

తినే తిండిలో వచ్చిన వెంట్రుకను తీసి.. పక్కన పెట్టేసి.. ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండమని సాత్వికంగా చెప్పి ఉంటే ఇంత రచ్చ ఉండేది కాదుగా? ఇదిలా ఉంటే.. తాజా ఉదంతంతో బంగ్లాదేశ్ లో.. మహిళల వేధింపుల వ్యవహారం తెర మీదకు రావటమే కాదు.. ఈ ఉదంతాన్ని చూపించి.. ఈ ఇష్యూను మరింత సీరియస్ గా తీసుకోవాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.