కేసీఆర్ క్రెడిట్: పశ్చిమబెంగాల్ లో రైతుబంధు

Mon Dec 31 2018 18:40:23 GMT+0530 (IST)

గులాబీ దళపతి - తెలగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఖాతాలో చేర్చుకోదగిన మరో విజయం చేరింది.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు - రైతుబీమా పథకాలు పలు రాష్ర్టాలను ఆకర్షిస్తున్నాయి. రైతుబంధు - రైతుబీమా పథకాలు అద్భుతమైన పథకాలని ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రైతుబంధు పథకాన్ని అమలు చేయాలని ఒడిశా - జార్ఖండ్ రాష్ర్టాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ర్టాల సరసన తాజాగా పశ్చిమ బెంగాల్ కూడా చేరింది. ఎకరానికి సంవత్సరానికి రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందిస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. 18 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్య ఉన్న రైతులకు మరణిస్తే రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం సంబంధిత కుటుంబానికి అందజేస్తామని మమత స్పష్టం చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆమె పేర్కొన్నారు.రైతును రాజు చేయాలనే సంకల్పంతో.. రైతుబంధు పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టి ఆ పథకాన్ని దేశానికే దిక్సూచిలా చేశారు. తెలంగాణలో రైతుబంధు పథకం కింద ఎకరానికి సంవత్సరానికి రూ. 8 వేల పెట్టుబడి చొప్పున ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పెట్టుబడి సాయాన్ని మరో రూ. 2 వేలు పెంచి మొత్తంగా సంవత్సరానికి రూ. 10 వేల పెట్టుబడి సాయం చేస్తామని కేసీఆర్ ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో హామీనిచ్చిన విషయం విదితమే. ఆ మేరకు రాబోయే ఖరీఫ్ సీజన్ లో ఎకరానికి రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం చేయనున్నారు. రైతుబీమా కింద రూ. 5 లక్షల పరిహారాన్ని అందజేస్తున్నారు.