Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ అంటే కాంగ్రెస్‌ మురిసిన వేళ...

By:  Tupaki Desk   |   27 Nov 2015 11:30 AM GMT
ప్రధాని మోడీ అంటే కాంగ్రెస్‌ మురిసిన వేళ...
X
ప్రధాన ప్రతిపక్షం అంటేనే నిత్యం పాలకులను వాగ్బాణాలతో చీల్చి చెండాడుతూ ఉండడమే తమ ప్రధాన బాధ్యత అనుకుంటుంది. పాలకపక్షం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే అందులో లోపాలు వెతకడం ఒక్కటే, దాన్ని తూర్పార బట్టడం ఒక్కటే తమ బాధ్యత అని కూడా అనుకుంటుంది. నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత.. ఈ పోకడ మరింతగా పెరిగింది. మోడీ ప్రతినిర్ణయాన్నీ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయిలో తప్పుపడుతూ ఉంది. ఆయన వ్యక్తిగత విషయాలు, వస్త్రధారణ మాట్లాడే శైలి అన్ని పాయింట్లను తప్పుపడుతూ.. చాన్సు దొరికితే చాలు.. చెలరేగిపోతూనే ఉంది. అలాంటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌.. నరేంద్రమోడీ గురించి మురిసిపోయి అభినందిస్తే దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిందే కదా!

పార్లమెంటు సమావేశాల తొలిరోజున అదే జరిగింది. పార్లమెంటు సమావేశాల తొలిరోజు... ఇదే జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గురించి ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే పాజిటివ్‌ గా మాట్లాడుతూ.. ఆయన రికార్డు సృష్టించారంటూ సెలవివ్వడం విశేషమే.

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయిన గురువారం రోజున రాజ్యాంగ దినోత్సవం కూడా! ప్రధానంగా రాజ్యాంగ నిర్మాణం, రాజ్యాంగం ప్రసాదించే హక్కులు, అందులోని లోపాలు, ప్రత్యేకతల గురించే చర్చ సాగింది. రాజ్యాంగం మీద అధికారం ఉన్న వ్యక్తులు ఆయా అంశాల గురించి మాట్లాడారు. అయితే తొలిరోజే పార్లమెంటు ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7.15 గంటల వరకు నిరంతరాయంగా సాగింది. మధ్యలో ఓ గంటసేపు భోజనవిరామం తప్ప మరో గ్యాప్‌ లేదు. అయితే ఇంతసేపు కూడా ప్రధాని నరేంద్రమోడీ సభలోనే ఉన్నారు. సాధారణంగా ప్రధాని కాసేపు సభలో ఉంటూ.. కాసేపు పార్లమెంటు ఆవరణలో ఉండే తన కార్యాలయానికి వెళ్లి.. అక్కడి పనులు చూసుకుంటూ.. మళ్లీ వస్తూ గడపడం జరుగుతూ ఉంటుంది. కానీ కీలకమైన రాజ్యాంగం గురించిన చర్చ జరుగుతూ వచ్చిన తొలిరోజున పూర్తిసమయం ప్రధాని అక్కడే ఉన్నారు.

అంతే కాదు... ప్రతిపక్ష నేతలు ఏమేం మాట్లాడుతున్నారో వారు కీలకాంశాలు ఏం ప్రస్తావిస్తున్నారో అన్నీ శ్రద్ధగా ఆలకించారు. ఇతర పక్షాలకు చెందిన నాయకులు కూడా మాట్లాడుతున్నప్పుడు.. రాజ్యాంగం గురించిన ఇంపార్టెంట్‌ పాయింట్లు వస్తే.. ప్రధాని వాటిని నోట్సు రాసుకుంటూ కనిపించారు. ఇంత పూర్తి సమయం ప్రధాని సభలో ఉండడం, ఇంత శ్రద్ధగా చర్చలను ఆలకించడం చూసి.. కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ కు ఆనందం కలిగినట్లుంది. ప్రధాని రికార్డు సృష్టించారంటూ ఆయన కితాబులు ఇచ్చేశారు. అదీ సంగతి!