బాబుతో పోల్చుకుంటే.. వైఎస్సే బెటర్!

Thu Sep 14 2017 17:02:36 GMT+0530 (IST)

ప్రజా పాలనంటే ఎంతసేపూ డబ్బా కొట్టుకోవడమేనా?  లేనిది ఉన్నట్టు మసిపూసి మారేడు కాయను చేసిన చందంగా ఎంత సేపూ ప్రజలను భ్రమల్లో ముంచి పబ్బం గడుపుకోవడమేనా? ఇదేనా పాలనంటే? అని ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ అన్న చందంగా .. చంద్రబాబు పాలన మారిపోయిందని వారు విమర్శిస్తున్నారు. పేదలకు ఏదో చేసేస్తున్నాం.. మేం తప్ప ఇంకెవరూ పేదలను బాగు చేయలేరు. మాకు మాత్రమే అన్ని హక్కులూ ఉన్నాయని పదేపదే చాటింపు వేసే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ పేదలకు చేసింది ఏమిటి? అని నిలదీస్తున్నారు.

విషయంలోకి వెళ్తే.. అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.  విజయవాడ కార్పొరేషన్ ఎదుట పార్టీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్ - మల్లాది విష్ణు - బొప్పన భవకుమార్ తదితర  కార్యకర్తలు వందల సంఖ్యలో ధర్నాలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు.. చంద్రబాబు పాలనపై విమర్శలు సంధించారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పేరుతో శిలా ఫలకాలు వేస్తున్నారే తప్ప ఎలాంటి కట్టడాలూ చేయడం లేదని దుయ్యబట్టారు.

బాబు మూడున్నరేళ్ల కాలంలో ఈ పథకం కింద ఒక్క పనిని కూడా పూర్తి చేయలేదని కేవలం మాటలకు ప్రచారానికి మాత్రమే పరిమితం  అయ్యారని నేతలు విమర్శించారు. దివంగత వైఎస్ పాలనే బాగుందని ప్రజలు ఇప్పటికీ చెప్పుకొంటున్నారని వారు కొనియాడారు.   వైఎస్ హయాంలో 45లక్షల ఇళ్లు కట్టిస్తే చంద్రబాబు మూడున్నరేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని ధ్వజమెత్తారు. విజయవాడలో ఇళ్లకు శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు ఒక్క పని ప్రారంభం కాలేదని దుయ్యబట్టారు. అందుకే వైఎస్ ను  ప్రజలు  దేవుడిమాదిరిగా గుండెల్లో దాచుకున్నారని చెప్పారు. ఇప్పటికైనా సీఎం స్పందించి పేదలకు ఇళ్లు కట్టించాలని ప్రచారానికి ముగింపు పలకాలని కోరుతున్నారు.