Begin typing your search above and press return to search.

ప్రత్యేకం: ఆ విమానం... ఒక చేదు జ్ఞాప‌కం!

By:  Tupaki Desk   |   27 July 2016 4:11 AM GMT
ప్రత్యేకం: ఆ విమానం... ఒక చేదు జ్ఞాప‌కం!
X
నింగికి ఎగ‌సిన ఆ విమానం ఏమైందో తెలీదు! ఏ భూభాగంలో కూలిపోయిందో ఆచూకీ దొర‌క‌లేదు. ఏ స‌ముద్ర గ‌ర్భంలో ఛిద్ర‌మైందో శ‌క‌లాల జాడ లేదు. గ్ర‌హాంత‌రాల్లో ఏముందో తెలుసుకునే స్థాయికి టెక్నాల‌జీ అభివృద్ధి చెందింద‌ని మ‌నిషి ఆనంద‌ప‌డాలో... టేకాఫ్ అయిన ఒక విమానం భూమ్మీద ఎక్క‌డుందో క‌నుక్కోలేని చేత‌గాని త‌నానికి సిగ్గుప‌డాలో అర్థం కాని సంద‌ర్భం ఇది! ఆ విమానం కోసం దాదాపు రెండేళ్లుగా గాలింపులు జ‌రిగాయి. మూడు దేశాలు వెతుకులాడాయి. వేల కోట్ల డాల‌ర్లు వెచ్చించాయి. అయినా.. ఫ‌లితం లేక‌పోయింది. దాంతో అధికారులు చేతులు ఎత్తేశారు. అన్వేష‌ణ ముగిసింద‌న్నారు!

2014 మార్చి8వ తేదీన కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌ కు బ‌య‌లుదేరింది మ‌లేషియ‌న్ ఎయిర్‌ లైన్స్‌ విమానం 370. గాల్లోకి వెళ్లిన కాసేప‌టికే... అదృశ్యం అయింది! సాంకేతిక కేంద్రంతో సంకేతాలు తెగిపోయాయి. విమానం ఎటువైపు వెళ్లిందో... అందులో ప్ర‌యాణిస్తున్న 239 మంది ప‌రిస్థితి ఏమై ఉంటుందో అనే ఆందోళ‌న మొద‌లైంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వార్త సంచ‌ల‌న‌మైంది. వెంట‌నే, వెతుకులాట ప్రారంభ‌మైంది. హెలీకాప్ట‌ర్లు - విమానాలు - సముద్ర జ‌లాల్లోకి ప్ర‌త్యేక షిప్‌ లు వెళ్లాయి. గంట‌లు రోజులు... వారాలు... నెల‌లు గ‌డిచిపోయాయి. ఆ విమానం జాడ ఏమైందో ఎవ్వ‌రికీ అర్థం కాలేదు. విమానం మిస్ అయిన వార్త కొన్ని రోజులు మాత్ర‌మే హెడ్‌ లైన్స్‌ లో నిలిచింది. ఆ త‌రువాత‌, ప్ర‌పంచ మీడియా కూడా ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేసింది! కానీ, 239 మంది ప్ర‌యాణికుల కుటుంబ స‌భ్యులు మాత్రం త‌మ‌వారి కోసం క‌న్నులు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తూనే ఉన్నారు.

విమానం సంకేతాలు కోల్పోయాక ప‌శ్చిమం వైపు వెన‌క్కి వ‌చ్చింద‌నీ - ఆ త‌రువాత ద‌క్షిణంవైపు కాసేపు ప్ర‌యాణించి పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలోని హిందూ మ‌హాస‌ముద్రంలో కూలిపోయిందంటూ అప్ప‌ట్లో ప్రాథ‌మికంగా ఓ అంచ‌నాకు వ‌చ్చారు. దాని ప్ర‌కార‌మే అదే ప్రాంతంలో తీవ్రంగా గాలించారు. విమానం అక్క‌డే కూలిపోయి ఉంటుంద‌ని మ‌లేషియా ప్ర‌భుత్వం చెబుతూ ఉన్నా... క‌చ్చితంగా కూలిందా అని నిల‌దీస్తే మాత్రం - నీళ్లు న‌మ‌లాల్సిన ప‌రిస్థితే. దీంతో చాలా అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. ఆ విమానం గాల్లోనే పేలిపోయిందా..? లేదా, స‌ముద్రంలో ప‌డి మునిగిపోయిందా..? లేదా, గుర్తుతెలియ‌ని వారు ఎవ‌రైనా దారి మ‌ళ్లించి, ఏదైనా ర‌హ‌స్య విమానాశ్రయానికి తీసుకెళ్లిపోయారా..? లేదా, గ్ర‌హాంత‌ర వాసులు విమానాన్ని మాయం చేసి ఉంటారా..? ఇలాంటి అనుమానాలెన్నో ఈ ఘ‌ట‌న చుట్టూ ముసురుకున్నాయి. కానీ, ఒక్క ప్ర‌శ్న‌కూ స‌మాధానం దొర‌క్క‌పోవ‌డం బాధాక‌రం.

అదృశ్య‌మైన ఆ విమానంలో మ‌లేషియా - ఆస్ట్రేలియా - చైనా దేశాల‌కు చెందిన‌వారే ఎక్కువ‌మంది ఉన్నారు. దీని అన్వేష‌ణ కోసం ఇంత‌వ‌ర‌కూ 135 మిలియ‌న్ డాల‌ర్ల‌ను ఖ‌ర్చు చేశారు. 46,300 చ‌ద‌ర‌పు మైళ్ల‌లో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయినా ఫ‌లితం లేక‌పోయింది. దీంతో ఇప్ప‌టికే దాదాపు రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా కొన‌సాగుతున్న గాలింపు చ‌ర్య‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్టు శుక్ర‌వారం నాడు ఒక ప్ర‌క‌ట‌న విలువ‌డింది. దీనిపై ర‌క‌ర‌కాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎన్ని వినిపిస్తున్నా... ఆ విమానం ఏమై ఉంటుంద‌న్న ప్ర‌శ్న‌కు జ‌వాబు దొర‌క్కుండానే అన్వేష‌ణ ముగిసిపోవ‌డం విచార‌క‌రం.

ప్ర‌స్తుతం మ‌నకి అందుబాటులో ఉన్న టెక్నాల‌జీతో ఏమీ సాధించ‌లేం అని తేలిపోయింది. కాబ‌ట్టి, కొన్నాళ్ల‌పాటు ఈ ఆప‌రేష‌న్‌ ను ఆపేసి. మ‌ళ్లీ కొత్త‌గా ఏదైనా టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన‌ప్పుడు ఈ విమానం కోసం మ‌రోసారి అన్వేషించాల‌ని కొంతమంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇత‌ర గ్ర‌హాల మీద‌కి స్పేస్ క్రాఫ్ట్‌ ల‌ను పంపిస్తున్నాం. కానీ, భూమ్మీద ఉన్న సముద్రాల లోతుల్లోకి వెళ్ల‌గ‌లిగే వాహ‌కాల‌ను మ‌నం అభివృద్ధి చేసుకోలేక‌పోతున్నాం అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు ఆస్ట్రేలియా విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ఒక ఓష‌నోగ్రాఫ‌ర్‌.

ఏదైతేనేం... ప్ర‌స్తుతానికి అన్వేష‌ణ ముగిసింద‌ని ప్ర‌క‌టించేశారు! ఇక, ఆ విమానం ఒక చేదు జ్ఞాప‌కంగా చరిత్ర‌లో మిగిలిపోయిన‌ట్టే. దాని జాడ‌ను క‌నుక్కోలేని మాన‌వ ప్ర‌య‌త్నం ఒక ఘోర వైఫల్యంగానే ముందు త‌రాలు చెప్పుకుంటాయి. ఇవ‌న్నీ స‌రే.. కానీ, దాన్లో ప్ర‌యాణికుల సంగ‌తేంటి..? ఎదురుచూస్తున్న వారి బంధువుల‌కు స‌మాధానం ఏంటి..? త‌మ‌వారు ఉన్నారో పోయారో, వ‌స్తారని ఎదురు చూడాలో లేదో తెలియ‌ని వారి ఆవేద‌న‌కు బదులు ఏది..? వారి ఎదురు చూపుల‌కు ఫ‌లితం ఏంటి..? ప‌్ర‌మాదం మ‌ర‌చిపోవ‌చ్చు... కానీ, ప్ర‌మాదానికి కార‌ణం తెలుసుకోలేక‌పోవ‌డం.. మ‌ర‌చిపోగ‌ల‌మా!