Begin typing your search above and press return to search.

మోడీ టీ అమ్మిన స్టేష‌న్ సుడి తిరిగింది

By:  Tupaki Desk   |   22 April 2017 4:28 AM GMT
మోడీ టీ అమ్మిన స్టేష‌న్ సుడి తిరిగింది
X
ప్ర‌ధాని మోడీ గొప్ప‌త‌నం గురించి చెప్పుకుంటూ పోతే.. గంట‌లు కూడా స‌రిపోవు. ఒక సామాన్యుడు భార‌త్ లాంటి సంక్లిష్ట రాజ‌కీయాల్లో ఎదిగి.. ఏకంగా దేశ ప్రధాని అవుతారా? ఎలాంటి రాజ‌కీయ బ్యాగ్రౌండ్ లేకుండా.. ఇంకాస్త వివ‌రంగా చెప్పాలంటే.. చిన్న‌ప్పుడు తండ్రితో క‌లిసి టీ అమ్మిన ఓ కుర్రాడు.. దేశాన్నిశాసించే స్థాయికి చేరుకుంటారా? అంటే.. మోడీ ముందు వ‌ర‌కూ లేద‌నే చెప్పేవాళ్లు. కానీ.. అలాంటిది సాధ్య‌మేన‌ని నిరూపించారాయ‌న‌.

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా సుప‌రిచితుడైన మోడీ.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ ఆయ‌న‌కున్న ఇమేజ్ వేరు. ఎప్పుడైతే బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారో.. అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు సంబంధించిన స‌రికొత్త అంశాలు బ‌య‌ట‌కు రావ‌టం మొద‌లైంది. మోడీ చిన్న‌త‌నంలో రైల్వే స్టేష‌న్లో టీలు అమ్మేవాళ్ల‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ మాట‌కు వ‌స్తే.. త‌న బాల్యానికి సంబంధించిన విష‌యాల్ని మోడీ.. చాలా తెలివిగా దేశ ప్ర‌జ‌ల‌కు చెప్పుకోగ‌లిగారు.

వార‌స‌త్వ రాజ‌కీయాల‌తో విసిగిపోయిన దేశ ప్ర‌జ‌ల‌కు మోడీ మాట‌లు కొత్త ర‌కంగా అనిపించాయి. ఒక టీ అమ్మిన వ్య‌క్తి.. స్వ‌శ‌క్తితో ఎదిగి.. ఏకంగా దేశ ప్ర‌ధాని స్థానానికి పోటీ ప‌డ‌టం అంద‌రిలోనూ ఆశ్చ‌ర్యాన్ని.. ఆస‌క్తిని రేకెత్తించింది. దీనికి త‌గ్గ‌ట్లే మోడీ మాట‌లు ప్ర‌జ‌ల్ని స‌మ్మోహితుల్ని చేసింది. దీంతో.. ఆయ‌న ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశాన్నిచ్చాయి. త‌న‌కు ల‌భించిన అవ‌కాశాన్ని దీర్ఘ‌కాలం కొన‌సాగేలా మోడీ వ్యూహాలు సాగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. మోడీ లాంటి నేత చిన్న‌త‌నంలో టీ అమ్మిన రైల్వే స్టేష‌న్ ను తాజాగా రైల్వేశాఖ గుర్తించింది. గుజ‌రాత్ లోని వాద్ న‌గ‌ర్ స్టేష‌న్ అభివృద్ధి కోసం ఏకంగా రూ.8కోట్లు కేటాయిస్తూ రైల్వేశాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని రైల్వే స‌హాయ మంత్రి సిన్హా వెల్ల‌డించారు. వాద్ న‌గ‌ర్ తో పాటు మోధెరా.. ప‌టాన్ ప్రాంతాల్ని రూ.100 కోట్ల‌తో ప‌ర్యాట‌క స్థ‌లాలుగా అభివృద్ధి చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. మోడీ త‌న బాల్యంలో టీ అమ్మిన రైల్వేస్టేష‌న్ ద‌శ‌.. దిశ రెండూ మారిపోతున్నాయ‌ని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/