Begin typing your search above and press return to search.

అలాంటోళ్ల చెంప ప‌గ‌ల‌గొట్ట‌మ‌న్న సీఎం

By:  Tupaki Desk   |   16 Aug 2017 9:26 AM GMT
అలాంటోళ్ల చెంప ప‌గ‌ల‌గొట్ట‌మ‌న్న సీఎం
X
ముఖ్య‌మంత్రులందు ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ వేరుగా చెప్పాలి. పాలిటిక్స్ కు ఏ మాత్రం సంబంధం లేని ఆయ‌న‌.. ప్ర‌జాఉద్య‌మంతో రాజ‌కీయాల్లోకి రావ‌టం ఒక ఎత్తు.. సంచ‌ల‌న వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకొని ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. పేరుకు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టికీ.. కేజ్రీవాల్ అంటే దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే.. త‌నకున్న క్రేజ్ ను కేజ్రీవాల్ చేజేతులారా చెడ‌గొట్టుకున్నార‌న్న అప‌వాదు ఉంది. న‌మ్మి అధికారాన్ని ఇచ్చిన ఢిల్లీ ప్ర‌జ‌ల్ని.. ఢిల్లీని అభివృద్ధి ప‌ట్టాల మీద ప‌రుగులు పెట్టించి.. ఢిల్లీ మోడ‌ల్ ను వేరే రాష్ట్రాల‌కు విస్త‌రిస్తే బాగుండేది. కానీ.. అందుకుభిన్నంగా లేడికి లేచిందే ప‌రుగు అన్న రీతిలో ఆయ‌న జాతీయ రాజ‌కీయాల‌తో పాటు.. ప‌లు రాష్ట్రాల్లో ప‌వ‌ర్ కోసం ఆయ‌న ప‌డిన త‌ప‌న అంతా ఇంతా కాదు.

దీంతో.. ఇప్ప‌టికే ప‌వ‌ర్ లో ఉన్న ఢిల్లీ రాష్ట్రంతో పాటు.. ప‌లు రాష్ట్రాల్లో ఆయ‌న ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారింది. అదే స‌మ‌యంలో ఆయ‌న‌పై వెల్లువెత్తిన విమ‌ర్శ‌లు.. పాల‌న‌లో ఆయ‌న మార్క్ క‌నిపించ‌క‌పోవ‌టం.. స‌మ‌ర్థ‌త విష‌యంలో సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా ఆయ‌న ప్ర‌వ‌ర్తన ఉండ‌టంతో కేజ్రీవాల్ పై ఉన్న అభిమానం కాస్తా ఆగ్ర‌హంగా మారింది.

ఈ విష‌యాన్ని కాస్త ఆల‌స్యంగా గుర్తించిన ఆయ‌న కొన్ని నెల‌లుగా ఢిల్లీకి మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. అంతేనా.. త‌న‌కు సంబంధం లేని విష‌యాల మీద స్పందించ‌టం మానేశారు. మోడీని టార్గెట్ చేయాల‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేసి.. త‌న పాల‌న మీద‌నే ఎక్కువ దృష్టి సారించారు. త‌న‌ను ఎక్కువ‌గా ఫోక‌స్ చేసే మీడియాకు సైతం దూరంగా ఉండ‌టంతో పాటు.. ట్విట్ట‌ర్‌ లోనూ ఆచితూచి పోస్టులు పెట్టే ధోర‌ణికి తెర తీశారు.

దీంతో.. ఆయ‌న హ‌డావుడి గ‌డిచిన కొద్దికాలంగా బాగా త‌గ్గింది. ఇదిలాఉంటే.. ఇటీవ‌ల కాలంలో గుజ‌రాత్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో మోడీ బ్యాచ్ క‌క్కుర్తి.. హ‌ర్యానాలో పాల‌క బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కుమారుడు ఒక ఐఏఎస్ అధికారి కుమార్తె ప‌ట్ల అస‌భ్యంగా వ్య‌వ‌హ‌రించేలా చేయ‌టం.. యూపీలోని గోర‌ఖ్ పూర్ లో చిన్నారుల మ‌ర‌ణాల ఎపిసోడ్ నేప‌థ్యంలో సీఎం కేజ్రీవాల్ తాజాగా రియాక్ట్ అయ్యారు.

పంద్రాగ‌స్టు సంద‌ర్భంగా జెండా ఆవిష్క‌ర‌ణ అనంత‌రం మాట్లాడిన ఆయ‌న‌.. ప‌లు అంశాల్ని ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా ఎవ‌రైనా మ‌హిళ‌ల ప‌ట్ల అఘాయిత్యాల‌కు పాల్ప‌డితే రెట్టింపు స్థాయి శిక్ష‌లు వేసేలా చ‌ట్టాల‌ను తీసుకురావాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా హ‌ర్యానా ఉదంతాన్ని ఆయ‌న ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు.

ఈ మ‌ధ్య‌న ఓ నేత కుమారుడు మ‌హిళ‌పై అఘాత్యానికి పాల్ప‌డ్డాడ‌ని.. ఈ సంద‌ర్భంగా మ‌రో నేత మ‌హిళ‌లు రాత్రిళ్లు బ‌య‌ట‌కు రావొద్దంటూ స‌ల‌హా ఇవ్వ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. అలాంటి వారి చెంప ప‌గ‌ల‌కొట్టాల‌ని తాను కోరుతున్న‌ట్లుగా వెల్ల‌డించారు. చాలా కాలం త‌ర్వాత స‌మకాలీన రాజ‌కీయ అంశాల మీద కేజ్రీవాల్ రియాక్ట్ కావ‌టం.. అందులో కాస్తంత మ‌సాలా ద‌ట్టించి ఉండ‌టంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఆయ‌న వ్యాఖ్య‌ల మీద ప‌డుతోంది.