Begin typing your search above and press return to search.

మ‌హేశ్ పై కోడిగుడ్ల దాడి..లైవ్ లో ఫ్యాన్స్ డిబేట్!

By:  Tupaki Desk   |   19 Jan 2018 11:44 AM GMT
మ‌హేశ్ పై కోడిగుడ్ల దాడి..లైవ్ లో ఫ్యాన్స్ డిబేట్!
X

కత్తి మహేష్ పై గురువారం రాత్రి మాదాపూర్ ప్రాంతంలో కోడిగుడ్లతో దాడి జరిగిన సంగ‌తి తెలిసిందే. గతంలో కూడా కొంద‌రు ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌న వెంట ప‌డ్డార‌ని - త‌న కారును వెంబ‌డించార‌ని - సంక్రాంతికి త‌న సొంత ఊరికి వెళ్లేట‌పుడు కూడా త‌న‌ను ఫాలో అయ్యార‌ని క‌త్తి మ‌హేశ్ ఆరోపించిన విషయం విదిత‌మే. అయితే, తనపై కోడిగుడ్ల దాడిని మ‌హేశ్ సీరియ‌స్ గా తీసుకున్నారు. ఆ దాడిని అవమానంగా భావించిన మహేశ్ శుక్రవారం ఉద‌యం మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తనకు, పవన్ అభిమానులకు గ‌త 4 నెలలుగా సోషల్ మీడియాలో వెర్బ‌ల్ వార్ నడుస్తోంద‌ని - కొద్ది రోజుల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ వ‌ద్ద కూడా ప‌వ‌న్ అభిమానులు త‌న‌పై దాడి చేసేందుకు య‌త్నించార‌ని మ‌హేశ్ ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో త‌న‌పై దాడి చేసిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు క‌చ్చితంగా పవన్ ఫ్యాన్స్ అని తాను గట్టిగా నమ్ముతున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, అనూహ్యంగా ఓ టీవీ చానెల్ నిర్వ‌హించిన డిబేట్ లో ఆ కోడిగుడ్ల దాడికి పాల్ప‌డ్డ వ్య‌క్తులు - క‌త్తి మహేశ్ పాల్గొన‌డం అంద‌రికీ షాక్ ఇచ్చింది. ఆ దాడికి పాల్ప‌డింది తామేన‌ని, ఆ వ్య‌క్తులు లైవ్ లో చెప్పి సంచ‌ల‌నం రేపారు.

తామే మ‌హ‌శ్ పై దాడి చేశామ‌ని హైద‌రాబాద్ కు చెందిన స‌తీష్ - నాని లు లైవ్ లో తెలిపారు. గ‌త నాలుగు నెల‌లుగా ప‌వ‌న్ ఫ్యాన్స్ - మ‌హేశ్ ల మ‌ధ్య జ‌రుగుతున్న ప‌రిణామాలు చూసి క‌ల‌త చెందాన‌ని స‌తీష్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ వ‌ద్ద మ‌హేశ్ తో మాట్లాడి...క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు ప్ర‌య‌త్నించాన‌ని, ఆయ‌న కారు అద్దం వ‌ద్ద‌కు వెళ్లి దండంపెట్టి అడిగాన‌ని - కానీ ఆయ‌న స్పందించ‌లేద‌ని చెప్పారు. ఆ త‌ర్వాత ఓ చానెల్ కు వెళ్లిన మ‌హేశ్ ను వెంబ‌డించాన‌ని, అక్క‌డకూడా ఆయ‌న‌తో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు వ‌చ్చి వారించి పంపించార‌ని చెప్పారు. త‌న‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని మ‌హేశ్ పై కోపం వ‌చ్చింద‌న్నారు. మ‌హేశ్ ద‌ళితుల‌పేరును దుర్వినియోగం చేస్తున్నార‌ని, అది త‌న‌కు న‌చ్చ‌లేద‌నిదాడికి పాల్ప‌డ్డ మ‌రో ప‌వ‌న్ అభిమాని నాని చెప్పాడు. ప‌వ‌న్, ఆయ‌న ఫ్యాన్స్, మ‌హేశ్ వివాదంలోకి కులం, మ‌తం ప్ర‌స్తావ‌న తేవ‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని అన్నారు. ఆయ‌న‌తో రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం మ‌హేశ్ త‌మ‌కు ఇవ్వ‌లేద‌ని, అందుకే త‌ప్ప‌నిస‌రి పరిస్థితుల్లో గుడ్ల‌తో దాడిచేశామ‌ని వారు చెప్పారు. ప‌బ్లిసిటీ కోసం తామీ ప‌ని చేయ‌లేద‌న్నారు. ఆ దాడి చేసిన త‌ర్వాతే తాము స్టూడియోలో వ‌చ్చి మ‌హేశ్ తో మాట్లాడ‌గ‌లుగుతున్నామ‌ని, త‌మ బాధ‌ను ఆయ‌న‌కు చెప్పాల‌ని మాత్ర‌మే ఆ చ‌ర్య‌కు పాల్ప‌డ్డామ‌ని తెలిపారు.

మ‌హేశ్ పై త‌మ‌కు ఏవిధ‌మైన వ్యక్తిగ‌త క‌క్ష లేద‌న్నారు. తాము కేవ‌లం నిర‌స‌న తెలపాల‌ని గుడ్లు విసిరామ‌ని, ఆయ‌న‌పై దాడి చేయాల‌ని, గాయ‌ప‌ర‌చాల‌నే ఉద్దేశం త‌మ‌కు లేద‌న్నారు. ప్రెస్ క్ల‌బ్ ద‌గ్గ‌ర కూడా తాను మ‌హేశ్ కారు అద్దాల ద‌గ్గ‌ర‌కు వెళ్లి....న‌మ‌స్కారం చెప్పి త‌న పేరు చెప్పి రెండు నిమిషాలు టైం ఇవ్వాల‌ని కోరాన‌ని,....కానీ, కొన్ని యూట్యూబ్ చానెళ్ల‌లో అది బీప్ చేశార‌ని అన్నారు. ఒరిజిన‌ల్ వీడియోలో తాను మాట్లాడింది రికార్డ‌యింద‌ని చెప్పారు. ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాల‌నేదే త‌మ ఉద్దేశ‌మ‌న్నారు. త‌మ‌కు జ‌న‌సేన‌కు సంబంధం లేద‌ని, తాము కేవ‌లం ప‌వ‌న్ ఫ్యాన్స్ మాత్ర‌మేన‌ని అన్నారు. త‌మ వెనుక ఎవ‌రూ లేర‌ని, తాము కేవ‌లం వ్య‌క్తిగతంగా ఈ గొడ‌వ స‌ద్దుమ‌ణిగేలా చేయ‌డానికి దాడి చేశామ‌న్నారు. త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని, మ‌హేశ్ కు మాత్రమే మ‌నోభావాలుంటాయా అని స‌తీష్ ప్ర‌శ్నించారు. ప్ర‌తి రోజు టీవీల్లో డిబేట్ లు చూసి విసిగి పోయాన‌ని, ఈ గొడ‌వ‌కు ఈ రోజుతో పుల్ స్టాప్ పెట్టాల‌ని వ‌చ్చాన‌ని, అందుకోసం ఎంత‌కైనా తెగిస్తాన‌ని, అరెస్ట‌య్యేందుకు కూడా సిద్ధ‌మ‌ని చెప్పారు.

అయితే, ఈ విష‌యంపై మ‌హేశ్ మ‌రోలా స్పందించారు. సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ వ‌ద్ద 3-4 బైకుల మీద కొంద‌రు వ్య‌క్తులు త‌న‌ను వెంబ‌డించార‌ని, అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని పోలీసులు కంట్రోల్ చేస్తున్నార‌ని, ఆస‌మ‌యంలో త‌న కారు అద్దాలు ఎవ‌రో బాదుతుంటే తాను విండో ఎలా ఓపెన్ చేస్తాన‌ని మ‌హేశ్ అన్నారు. అప్ప‌టికే త‌న‌కు చాలా బెదిరింపులు వ‌చ్చాయ‌ని, వారు సామ‌ర‌స్య పూర్వ‌కంగా మాట్లాడ‌తార‌ని తాను ఎలా ఊహిస్తాన‌ని అన్నారు. ఇప్పుడు కూడా త‌న‌పై కోడి గుడ్లు విసిరి...పారిపోయిన ప‌వ‌న్ ఫ్యాన్స్...త‌న‌తో సామ‌ర‌స్య వాతావ‌ర‌ణంలో చ‌ర్చిస్తార‌ని ఎలా భావిస్తాన‌ని అన్నారు. నాని ద‌ళిత కులానికి చెందిన వార‌ని, అందుకే ద‌ళితుడైన త‌న‌పై దాడి చేయించి విష‌యాన్ని త‌ట‌స్థీక‌రించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని మ‌హేశ్ ఆరోపించారు. యువ‌కుల జీవితాలు నాశ‌న‌మ‌వుతాయ‌నే తాను ఇప్ప‌టివ‌ర‌కు కేసులు పెట్టాల‌ని ఆగాన‌ని, కానీ, వీరిని చూస్తుంటే వీరి వెనుక ఎవ‌రో ఉండి ప్లాన్ గా జ‌రిపిస్తున్నార‌ని అనిపిస్తోంద‌న్నారు. త‌న‌పై జ‌రిగిన దాడికి స‌తీష్, నాని త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, ప‌శ్చాత్తాప ప‌డాల‌ని, అపుడే కేసు వాప‌స్ తీసుకుంటాన‌ని మ‌హేశ్ అన్నారు. దాంతోపాటుఒక‌టి ప‌వ‌న్ ఫ్యాన్స్ కు ప‌వ‌న్ సర్ది చెప్పుకోవాల‌ని, రెండోది త‌న‌కు ప‌వ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని...లేకుంటే ఈ వివాదానికి తెర‌ప‌డ‌ద‌ని మ‌హేశ్ మ‌రోసారి స్పష్టం చేశారు. ఇండ‌స్ట్రీ నుంచి కూడా త‌మ్మారెడ్డి, కోన వెంక‌ట్ వంటి వారు ఈ వివాదానికి తెర‌దించాల‌ని చొర‌వ తీసుకుంటున్నప‌వ‌న్ త‌ర‌పున ఎవ‌ర‌న్నా స్పందిస్తారో లేదో వేచి చూడాలి.