Begin typing your search above and press return to search.

మహేశ్‌ 'చింతల్' తీర్చేనా?

By:  Tupaki Desk   |   3 Sep 2015 9:22 AM GMT
మహేశ్‌ చింతల్ తీర్చేనా?
X
'శ్రీమంతుడు' హీరో... ప్రిన్స్ మహేశ్‌ బాబు రియ‌ల్ లైఫ్‌ లో కూడా శ్రీ‌మంతుడి గా మారి పాలమూరు జిల్లాలోని చింతలకుంట గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ పిలుపుతో స్పందించిన ప్రిన్స్.. అభివృద్ధి చేసేందుకు చింతలకుంటను ఎంపిక చేసుకున్నారని చెబుతున్నారు. మొన్నటి వరకూ ఈ గ్రామం ఎవ్వరికీ తెలిసేది కాదు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండే ఆ గ్రామం.. ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. కారణం.. 'శ్రీమంతుడు'. అవును... ప్రిన్స్ మహేశ్‌ బాబు ఈ గ్రామాన్ని దత్తతకు తీసుకున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో తమ చింతలన్నీ తీరినట్లేనని చింతలకుంట ప్రజలు ఆనందంతో ఉన్నారు. రీల్‌ లైఫ్‌ లోనే కాదు.. రియల్‌ లైఫ్‌ లో కూడా శ్రీమంతుడని పిలిపించుకుంటున్న హీరో మహేష్ బాబు చాంతాడంత స‌మ‌స్య‌ల‌ను క‌లిగి ఉన్న చింతలకుంట గ్రామం చింతలు తీర్చుతాడా? ఈ క్ర‌మంలో ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాడు? ఈ ప్ర‌శ్న‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

మహబూబ్‌ నగర్‌ జిల్లా గట్టు మండలంలోని ఓ మారుమూల గ్రామం చింతలకుంట. తెలంగాణలోని గద్వాలకు 45 కిలోమీటర్ల దూరం ఈ గ్రామం ...కర్ణాటకలోని రాయచూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే... తెలుగు రాష్ర్టం కంటే...పొరుగు రాష్ర్ట‌మే ద‌గ్గ‌ర అన్న‌ట్లు. తెలంగాణ‌లో చివ‌రన ఉన్న ఈ గ్రామం అభివృద్ధికి కూడా ఆమడ దూరంలోనే ఉంది! మహేష్‌ బాబు దత్తత తీసుకోనున్న ఈ గ్రామంలో అడుగడుగునా సమస్యలే. కనీస సదుపాయాలు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామంలో దాదాపు 700 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ తాగునీటి పథకం లేదు. ఉన్న ఒక్క బావి సుమారు 15 ఏళ్ల క్రితమే పాడుపడింది. దీంతో సమీపంలోని పంట పొలాల్లో ప్రవహించే నీటిపైనే వీరు ఆధారపడుతున్నారు. కలుషిత నీటిని తాగడం వల్ల తరచూ.. రకరకాల వ్యాధులతో బాధ‌ప‌డుతున్నారు. వీరి వైద్యం కోసం క‌ర్ణాట‌క‌లోని రాయచూర్‌ కు వెళ్తున్నారు. బిందె నీటి కోసం మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు.

ఈ గ్రామంలో సామాజిక భవనం, రచ్చబండలు లేవు. వీటిపై గత ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తించాయని స్థానికులంటున్నారు. ఇక ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్ల నిర్మాణం, డ్రెయిన్‌ వ్యవస్థలను అసంపూర్తిగా వదిలేశారు. అప్పట్లో చేపట్టిన రోడ్డు రూపురేఖలు మారాయి. అత్యంత కరువు ప్రాంతమైన గట్టులో వర్షపాతం నమోదు సైతం దేశంలోనే అత్యల్పం. గట్టు మండలంలో ఎటుచూసినా ఎడారిని తలపించే విధంగా ఉంటుంది. దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత శాతం కూడా గట్టు మండలంలోనే నమోదవుతుంది. అయితే తమ గ్రామాన్ని హీరో మహేశ్‌బాబు దత్తత తీసుకున్నాడనే వార్త.. ఇక్కడి ప్రజల్లో జీవం నింపింది. అత్యంత వెనకబడిన ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న మహేష్... నిజమైన శ్రీమంతుడంటూ స్థానికులు ఆకాశానికెత్తేస్తున్నారు. మహేష్ దత్తత స్వీకారంతో తమ గ్రామం రూపురేఖలు మారిపోతాయని.. తమ ఊరిపేరులోని చింతలు తీరుతాయని స్థానికులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.

త‌మ ప్రాంతాన్ని ద‌త్త‌త మ‌హేశ్ త్వ‌ర‌గా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని చింత‌ల‌కుంట‌లోని ప్ర‌తి హృద‌యం కోరుకుంటోంది.