ఒక మంచి నిర్ణయం..3 లక్షల ఉద్యోగాలు పోగొట్టింది!

Sun Jun 24 2018 22:13:19 GMT+0530 (IST)

ఏంటి... ఇదెలా సాధ్యమనుకుంటున్నారా? ఇది ఈ శనివారమే జరిగింది మహారాష్ట్రలో. ఇంతకీ 3 లక్షల ఉద్యోగాలు పోగొట్టిన ఆ మంచి నిర్ణయం ఏంటంటే... ప్లాస్టిక్ బ్యాన్. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం మంచిదే అయినా ఎంతో మందిని తాత్కాలికంగా రోడ్డున పడేసింది. ఎన్నో కంపెనీలను దివాలా తీయించింది. పరోక్షంగా బ్యాంకులకూ నష్టం కలిగించింది.ఈ శనివారం నుంచి ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచులు - స్పూన్లు - ఫోర్కులు - ప్లేట్లు - బాటిల్స్ తో పాటు థర్మాకోల్ ఐటెంలు తయారుచేయడం గాని వాడటం గాని కలిగి ఉండటం గాని నేరం. మూడు నెలల క్రితమే మార్చి 23న ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాత్రికి రాత్రి పూర్తి స్థాయి నిషేధం అనేక దుష్పరిణామాలకు దారితీస్తుందని మూడు నెలల సమయం ఇచ్చింది. ఆ మూడు నెలల గడువు శనివారంతో ముగిసింది. దీంతో ఆ పరిశ్రమలో పనిచేసే 3 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. అయితే ఈ మూడు నెలల సమయంలో వారిలో కొందరికి ఉద్యోగాలు దొరికినా చాలా మంది ఇంకా నిరుద్యోగులుగానే ఉన్నారట.

మరోవైపు ఈ పరిశ్రమ ప్లాస్టిక్ బ్యాన్ వల్ల 15000 కోట్ల నష్టాన్ని చవిచూసిందంటున్నారు. ఈ కంపెనీలు దివాలా తీయడం వల్ల వీటికి లోన్లు ఇచ్చిన బ్యాంకులకు కూడా మిగిలిపోయిన రుణ వసూలు చాలా కష్టసాధ్యంగా మారనుంది. ఇదంతా రాష్ట్ర జీడీపీపై కూడా ప్రభావం చూపింది. అయినా ప్రభుత్వం వెరవలేదు. దేశ వాణిజ్య రాజధాని ముంబయి కూడా మహారాష్ట్రలో ఉండటంతో ఈ పరిశ్రమపై చాలా దెబ్బ పడినట్లయ్యింది. ఉదయం లేచిన దగ్గరనుంచి ప్లాస్టిక్ లేనిదే మన జీవితం నడవని నేపథ్యంలో... ఇపుడు ఈ నిర్ణయం వల్ల దీర్ఘకాలిక ఉపయోగాలు తాత్కాలిక ఇబ్బందులు తప్పవు.