మహాకూటమి గెలుపు పేపర్ లోనేనా?

Fri Nov 09 2018 15:02:17 GMT+0530 (IST)

‘పచ్చ’ప్రకోపం తెలంగాణను కూడా తాకుతోంది. పసుపు పచ్చ చొక్కాలు తమ కోట్ల అక్రమ డబ్బును తెలంగాణపై విదిల్చి.. తమ మీడియాతో బెదిరించి.. లేని గాలిని సృష్టిస్తున్నాడు. అఖండ గులాబీ దళాన్ని ఎదుర్కోలేక కూటమి కట్టిన ప్రతిపక్షాలకు ఇప్పుడు ఆ ‘పచ్చ’ అధిపతి అందినంత భరోసానిస్తున్నాడట.. తన చేతిలో ఉన్న పచ్చ మీడియాతో అభూత కల్పనలు సృష్టిస్తున్నాడట..  గులాబీ గాలిని తగ్గించి చూపిస్తున్నాడట..ఎప్పుడైతే మహాకూటమితో టీడీపీ అధినేత చంద్రబాబు కలిశాడో అప్పుడే పచ్చ మీడియా కాంగ్రెస్ వైపు  టర్న్ అయిపోయింది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయగానే కేసీఆర్ కు 80 సీట్లు వస్తాయని ఘంటా బజాయించి చెప్పిన ‘పచ్చ’ పత్రికాధినేత ఇటీవల 60 కూడా రాకపోవచ్చని సన్నాయి నొక్కులు నొక్కాడు. ఎందుకంటే కేసీఆర్ కు వ్యతిరేకంగా కూటమిలో  బాబు చేరాడు మరీ..దీంతో మీడియా పెద్దాయన గొంతు సవరించుకున్నాడు..

నిజానికి కేసీఆర్ కు బలం బలగం.. తెలంగాణలోని లబ్ధి దారులే.. మిషన్ కాకతీయ నుంచి రైతుబంధు - రైతు బీమా - రేషన్ - పెన్షన్ - కళ్యాణ లక్ష్మీ - షాదీ ముబారక్ ల లబ్ధిదారులను కలిపితేనే దాదాపు 80 లక్షల మంది ఉంటారని అంచనా.. అంటే వారి ఫ్యామిలీలను లెక్కవేసుకున్నా 2 కోట్లు దాటుతారు.  తెలంగాణ రాష్ట్రసమితి ప్రభుత్వానికి అండగా కనీసం తెలంగాణ జనాభాలో సగం మంది అయినా ఉన్నారు. అందుకే ఎన్నో సర్వేలు టీఆర్ ఎస్ దే తెలంగాణ పీఠం అని ఘంటా బజాయించి చెబుతున్నాయి. తాజాగా ఇండియా టుడే సర్వే కూడా సంక్షేమ పథకాలే కేసీఆర్ విజయానికి కారణమవుతున్నాయని.. మరో సారి గెలవబోతున్నాడని సర్వేలో నిగ్గు తేల్చింది. టీఆర్ ఎస్ కే ప్రజలు మరోసారి పట్టం కట్టేలా ఉన్నారని తెలుస్తోంది.

కానీ పచ్చమీడియా కాంగ్రెస్-టీడీపీ తోడ్పాటుతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తిమ్మిని బమ్మి చేసి అభూతకల్పనలతో పెద్దగా చూపించి టీఆర్ ఎస్ కు వ్యతిరేక వార్తలను పోస్టు చేస్తున్నారు. పోయిన సారితో పోల్చితే కాస్త వ్యతిరేక ఓట్లతో టీఆర్ ఎస్ మెజార్టీ తగ్గవచ్చు.. కానీ అధికారంలోకి మాత్రం టీఆర్ ఎస్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వేలు తేల్చాయి. కానీ పచ్చ మీడియా పత్రికలు మాత్రం చంద్రబాబు మెప్పుకోసం మహాకూటమికి ఆదరణ పెరుగుతోందని హైప్ క్రియేట్ చేస్తున్నాయి. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అల్లకల్లోలం సృష్టిస్తూ ఓడిపోతారంటూ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు - సీఎం కేసీఆర్ కు మధ్య పొరపొచ్చాలు వచ్చేలా పకడ్బందీగా డ్రామాలకు తెరతీస్తున్నారు..

కానీ గులాబీ దళం మాత్రం ధీమాగా ఉంది. ప్రజలకు తాము చేసిన మంచి పనులు - పథకాలే గెలిపిస్తాయని విశ్వాసంతో ఉన్నారు. ఎన్ని కుట్రలు - కుతంత్రాలు చేసినా.. బాబు పచ్చ మీడియా వికటట్టహాసం చేసినా.. జనం మదిలో ఉన్న గులాబీ జెండాను ఎవ్వరూ తీయలేరని.. కారు జోరును ఆపలేరని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.