Begin typing your search above and press return to search.

వీడు ప‌గ‌టి దొంగ‌.. వీడి స్టైలే డిఫ‌రెంట్‌!

By:  Tupaki Desk   |   16 Oct 2018 10:36 AM GMT
వీడు ప‌గ‌టి దొంగ‌.. వీడి స్టైలే డిఫ‌రెంట్‌!
X
నేర‌గాళ్లు ఎవ‌రైనా.. ఎంత‌టోళ్లు అయినా ఏదో రోజు వారు పోలీసుల‌కు దొర‌కాల్సిందే. క‌త్తి ప‌ట్టుకున్నోడు.. తుపాకీ ప‌ట్టినోడు.. వారు మొద‌లెట్టిన హింస‌కే బ‌లి అవుతుంటారు. అలానే.. దొంగ‌లు కూడా అంతే. తాజాగా సైబ‌రాబాద్ పోలీసులు ఒక దొంగ‌ను ప‌ట్టుకున్నారు. వాడి వ్య‌వ‌హారం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. ఈ దొంగ ప‌గ‌టి దొంగ‌. కేవ‌లం ప‌గ‌లు మాత్ర‌మే దొంగ‌త‌నం చేస్తాడు.. రాత్రిళ్లు అస్స‌లు చేయ‌డు. ఇంత‌కీ ఇత‌గాడి పేరేమిటంటారా? ప‌ఠాన్ మ‌హ‌బూబ్ ఖాన్‌. ఇత‌గాడి స్వ‌స్థ‌లం అనంత‌పురం జిల్లా గుల్జారిపేట‌. మొద‌ట్లో డీజిల్ మెకానిక్ గా ప‌ని చేసి.. జ‌ల్సాల‌కు మ‌రిగి దొంగ‌య్యాడు.

త‌న‌ను ప‌ట్టుకున్న పోలీసుల‌కు మ‌స్కా కొట్టేసి.. ఒక ద‌శ‌లో వారి సానుభూతిని కూడా కొట్టేశాడ‌ట‌. త‌న‌కు రేచీక‌టి అని క‌థ చెప్పిన ఇత‌గాడి వ్య‌వ‌హారం మిగిలిన దొంగ‌ల‌కు భిన్నంగా ఉంటుంది. పొద్దున్నే సూటు బూటు వేసుకున్నంత ద‌ర్జాగా చ‌క్క‌గా త‌యార‌వుతాడు. కాకుంటే త‌న‌తో పాటు ఒక ఇనుప రాడ్‌.. చిన్న స్క్రూడైవ‌ర్ దాచుకుంటాడు.

తాళాలు ఉన్న ఇల్లు క‌నిపించిందా? ఇకంతే.. ఆ ఇంటిని దోచుకోకుండా ఉండ‌లేడు. అందుకే.. 40 ఏళ్ల వ‌య‌సుకు అత‌గాడు మొత్తం 81 ఇళ్ల‌ను గుల్ల చేశాడు.

పెద్ద ఎత్తున చోరీలు చేసే ఇత‌గాడి జీవ‌న‌శైలి పూర్తి డిఫ‌రెంట్‌. అనంత‌పురం నుంచి హైద‌రాబాద్ వ‌చ్చేసిన అత‌డు.. తాళాలు వేసి ఉన్న ఇంటిని ఎంపిక చేసుకొని ప‌ని పూర్తి చేసుకున్న త‌ర్వాత కామ్ గా వెళ్లిపోతాడు. అంతేనా.. ఏ ప్రాంతంలోనూ ఎక్కువ‌గా ఉండ‌ని ఇత‌గాడు ఎవ‌రితోనూ మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌డు.

తానెక్క‌డ పోలీసుల‌కు చిక్కుతానేమోన‌న్న భ‌యంతో సెల్ ఫోన్ వాడేందుకు ఇష్ట‌ప‌డ‌ని ఇత‌గాడు.. త‌ర‌చూ కార్ల మీద త‌న‌కున్న మోజుతో వాటిని తెగ వాడేసేవాడు. అయితే.. కార్ల రిజిస్ట్రేష‌న్ల కోసం ఎలాంటి ప‌త్రాలు ఇవ్వ‌కుండా ప‌ని పూర్తి చేసే బ్రోక‌ర్ల‌ను ఆశ్ర‌యించేవాడు. కారు రేటుకు యాభైవేలు ఎక్కువైనా ఫ‌ర్లేదని చెప్పేవాడు. అంతేనా.. కారు మీద మోజు తీరినంత‌నే దాన్ని తెగ‌న‌మ్మేసే విచిత్ర‌ధోర‌ణి అత‌గాడి సొంతం.

ఇలా హైద‌రాబాద్ తో పాటు ఆంధ్రా.. క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో దొంగ‌త‌నాలు చేసే ప‌ఠాన్ ను.. సైబ‌రాబాద్ పోలీసులు ప‌ట్టుకున్నారు. ఇత‌డి ద‌గ్గ‌ర నుంచి దాదాపు 870 గ్రాముల (ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర కేజీ) బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ తో పాటు వెండి.. మ‌రికాస్త న‌గ‌దును రిక‌వ‌రీ చేసిన పోలీసులు ఇత‌డిపై కేసు న‌మోదు చేసి శ్రీ‌కృష్ణ జ‌న్మ‌స్థానానికి పంపారు.