Begin typing your search above and press return to search.

ద‌స‌రాకు ముందా? పండుగ త‌ర్వాతా..?

By:  Tupaki Desk   |   15 Oct 2018 5:10 AM GMT
ద‌స‌రాకు ముందా?  పండుగ త‌ర్వాతా..?
X
ఓప‌క్క గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే పందెం కోళ్ల‌ను ప్ర‌కటించేయ‌టం.. వారు ప్ర‌చారంలో త‌ల‌మున‌క‌లు కావ‌టం తెలిసిందే. అధికార పార్టీ కావ‌టం.. కేసీఆర్ అండ ఉండ‌టం.. నిధుల ప‌రంగా ఎలాంటి ఇబ్బంది లేక‌పోవటం లాంటి సానుకూలాంశాల‌తో టీఆర్ఎస్ నేత‌లు చెల‌రేగిపోతున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ అసెంబ్లీ ఎన్నిక‌లు అంటే.. ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ విడుద‌లై.. నామినేష‌న్ల గ‌డువు ముగియ‌టానికి ఒక‌ట్రెండు ముందు కానీ అభ్య‌ర్థుల జాబితా ఫైన‌ల్ కాని ప‌రిస్థితి. ఇలాంటి రోటీన్ ప్రాసెస్ కు భిన్నంగా.. ఊరికి ముందే జాబితాను డిసైడ్ చేసేసి.. ప్ర‌క‌టించిన వైనంతో అభ్య‌ర్థులు ధీమాగా ప్ర‌చారం చేసుకుంటున్న ప‌రిస్థితి.

అధికార పార్టీ తీరు ఇలా ఉంటే.. తెలంగాణ విపక్షాల ప‌రిస్థితి అందుకు భిన్నంగా మారింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌. ఒంట‌రిగా కాకుండా త‌న బ‌ద్ద శ‌త్రువైన టీడీపీతో పొత్తు పెట్టుకోవ‌టానికి సిద్ధం కావ‌టం ఒక సంచ‌ల‌నం అయితే.. కోదండం మాష్టారి నేతృత్వంలోని తెలంగాణ జ‌న‌స‌మితి.. తెలంగాణ‌లో కాస్త బ‌లం ఉన్న సీపీఐల‌తో క‌లిసి పొత్తు పెట్టుకోవాల‌ని భావిస్తోంది. మ‌రి.. దీనికి సంబంధించిన పొత్తు లెక్క‌ల‌తో పాటు.. అభ్య‌ర్థులు ఎవ‌ర‌న్న విష‌యంపై ఇప్ప‌టికి క్లారిటీ రాని ప‌రిస్థితి. అభ్య‌ర్థుల సంగ‌తి త‌ర్వాత‌.. పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. ఏ పార్టీ ఎక్క‌డెక్క‌డ పోటీ చేయ‌నుంది? అన్న అంశాల మీద చిక్కుముడులు వీడ‌ని ప‌రిస్థితి. దీంతో.. అయోమ‌యం అంత‌కంత‌కూపెరిగిపోతోంది.

టికెట్ల‌ను ఆశించే వారు పెరిగిపోవ‌టంతో పాటు.. పోటాపోటీగా ఈసారి త‌మ‌కే టికెట్లు కావాల‌ని డిమాండ్ చేస్తున్న వారు ఎక్కువ అవుతున్నారు. దీంతో.. కాంగ్రెస్‌.. టీడీపీల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఈ లొల్లి లేకుండా అభ్య‌ర్థుల జాబితాను వెనువెంట‌నే విడుద‌ల చేస్తే.. ఎక్క‌డ అసంతృప్తితో కొత్త స‌మ‌స్య‌లు తెర మీద‌కు వ‌స్తాయ‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఎన్నిక‌ల నోటిఫికేషన్ విడుద‌ల కావ‌టానికి ఇంకా టైం ఉండ‌టం.. ఆ లోపు అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టిస్తే.. టికెట్ రాని ఆశావాహులు ఎక్క‌డ ప్ర‌త్య‌ర్థి పార్టీలోకి వెళ్లి దెబ్బ తీస్తారోన‌న్న సందేహం కూడా ఉంది. అందుకే.. వీలైనంత ఆల‌స్యంగానే జాబితాను ప్ర‌క‌టించాల‌న్న ఆలోచ‌న‌లో కాంగ్రెస్ ఉన్న‌ట్లు చెబుతారు.

అయితే..ఈ ఆల‌స్యం వరంగా కాకుండా శాపంగా మారితే మొదటికే మోసం వ‌స్తుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. పొత్తు విష‌యంపై క్లారిటీ ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రికి ఎన్ని సీట్లు.. వారెవ‌రూ అన్న విష‌యంపై క్లారిటీకి రాని నేప‌థ్యంలో ఈ లెక్క తేల‌కుంటే గంద‌ర‌గోళంతో పాటు.. రేపు పొత్తు లెక్క తేలిన త‌ర్వాత అన‌వ‌స‌ర‌మైన లొల్లి ఖాయంగా ఉంటుందంటున్నారు. అందుకే.. లీకుల ద్వారా ఆయా పార్టీల నేత‌ల్ని మాన‌సికంగా సిద్ధం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

పొత్తు లెక్క‌లు నాలుగైదు రోజుల్లో తేల‌నున్న‌ట్లుగా ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నా.. అదంతా కూడా వ్యూహంలో భాగ‌మే త‌ప్పించి.. ఇప్ప‌టికిప్పుడు జాబితాను విడుద‌ల చేసే ధైర్యం విప‌క్షాల‌కు లేవ‌న్న మాట వినిపిస్తోంది. ద‌స‌రాకు ముందే పొత్తు లెక్క తేల్చేసి.. అభ్య‌ర్థుల విష‌యంపైనా ఒక్క కొలిక్కి వ‌స్తున్న‌ట్లుగా స‌మాచారం వ‌చ్చినా అందులో నిజం అస్స‌లు లేద‌ని చెబుతున్నారు. ద‌స‌రా మ‌రో నాలుగు రోజులే ఉన్నందున‌.. ఈ టైం స‌రిపోద‌ని.. ద‌స‌రా త‌ర్వాతే పొత్తు లెక్క‌లు ఒక కొలిక్కి రానున్న‌ట్లు చెబుతున్నారు. పొత్తు లెక్క‌లు తేలి.. అభ్య‌ర్థుల జాబితా బ‌య‌ట‌కు వ‌చ్చినంత‌నే అసంతృప్తుల‌కు ఎర వేసి గులాబీ కారులో ఎక్కించేందుకు తెలంగాణ అధికార ప‌క్షం సిద్ధంగా ఉందంటున్నారు. అలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌ల్లో ఉండేందుకే జాబితాను.. పొత్తు లెక్క‌ను వీలైనంత ఎక్కువ కాలం సాగ‌దీయాల‌న్న మాట వినిపిస్తోంది. దీంతో.. ద‌స‌రా పండ‌క్కి ముందు కంటే కూడా త‌ర్వాతే లెక్క‌పై క్లారిటీ వ‌స్తుంద‌ని చెబుతున్నారు.

ఈ నెల 18..19 తేదీల్లో పండ‌గ ఉండ‌టం.. నేటి నుంచి లెక్క వేసుకున్నా.. మ‌రో నాలుగైదు రోజులు మాత్ర‌మే ఉండ‌టం.. పండ‌క్కి ముందు జాబితాను ప్ర‌క‌టించినా.. పండ‌గ హ‌డావుడే త‌ప్పించి మ‌రింకేమీ ఉండ‌దు. దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం కన్నా.. అసంతృప్తుల కార‌ణంగా వాటిల్లే న‌ష్ట‌మే ఎక్కువ‌ని చెబుతున్నారు. అందుకే.. పండ‌గ త‌ర్వాతే జాబితా బ‌య‌ట‌కు వ‌చ్చే వీలుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.