టీడీపీకి మాగుంట గుడ్ బై?

Thu Nov 08 2018 16:59:20 GMT+0530 (IST)

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడే టైమొచ్చిందన్న ప్రచారం ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోంది. స్థానిక టీడీపీ నేతలు - చంద్రబాబు ఆయన మాటలు పట్టించుకోకపోవడమే దానికి కారణంగా చెబుతున్నారు. గెలుపు అవకాశాలున్నవారెవరో ఆయన చెబుతున్నప్పటికీ చంద్రబాబు ఏమాత్రం వినిపించుకోవడం లేదంటూ ఇటీవల ఆయన అనుచరుల వద్ద అన్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
    
మరోవైపు జిల్లాలో జరిగే కార్యక్రమాల్లోనూ ఆయన్ను ఇన్వాల్వ్ చేయడం లేదని టాక్.  ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో మాగుంటకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయట. ఈ విషయాన్ని అధిష్ఠానం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువగానే ఉండవచ్చు అని అంటున్నారు. కొండెపి మార్కాపురం ఎర్రగొండ్లపాలెం అభ్యర్థుల విషయంలో ఆయన చేస్తున్న సూచనలను పట్టించుకోవడం లేదని మాగుంట మండిపడుతున్నారట.
    
ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఆ పరిధిలోని నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలుంటేనే తన గెలుపు సునాయాసమవుతుందన్నది మాగుంట నమ్మకం. అది నిజం కూడా. అందుకోసం ఆయన ఒంగోలు పార్లమెంటు స్థానం పరిధిలోని ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో సర్వే చేయించుకునే దాని ప్రకారం అభ్యర్థులను సూచించారట. కానీ ఆయన మాటనెవరూ పట్టించుకోకపోవడంతో అది తన విజయంపై ప్రభావం చూపే ప్రమాదముందని ఆయన ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. అందుకే... టీడీపీని వీడాలనుకుంటున్నట్లు సమాచారం.