టీడీపీ ఎంపీ రిక్వెస్ట్!..పేకాడతాం పట్టుకోమాకండి!

Sat Sep 23 2017 22:40:02 GMT+0530 (IST)


మైకు దొరికితే చాలు ఉపన్యాసాల్లో నీతులు దట్టించి దంచికొట్టే ఏపీ సీఎం చంద్రబాబుకు గట్టి షాకిచ్చాడు సొంత పార్టీ ఎంపీ మాగంటి బాబు. పార్టీలో చాలా సీనియర్‌నేత అయిన మాగంటి... గతంలో పోలీసులను బెదిరించాడనే కేసు కూడా ఉంది. అదేవిధంగా సంక్రాంతి కోళ్ల పందాల విషయంలో ఆయన ఎన్నడూ వెనక్కి తగ్గిందిలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో వేసే కోళ్ల పందేల్లో సగానికిపైగా బాబు కనుసన్నల్లోనే సాగుతాయి. అయినా.. కూడా చంద్రబాబు ఎప్పుడు పిలిచి మందలించి మంచి చెప్పింది లేదు.ఇక ఇప్పుడు తాజాగా మాగంటి వారు హద్దు దాటేశారు. ఏం చేసినా మమ్మల్ని ఎవరు అనుకున్నారే ఏమో?  లేదా బాబు పాలనంటే టీడీపీ నేతల ఇష్టారాజ్యం అనుకున్నారో ఏమో.. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో యువకులను ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు - ప్రజలను రెచగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం శనివారం ఏలూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నేతలు - తమ్ముళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాగంటి అందరూ సిగ్గుపడేలా మాట్లాడారని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంతకీ ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే.. ``మే మింతే. మారేది లేదు. మీరు(పోలీసులు) మారాలి. మేం పేకాడతాం. మందు కొడతాం. అయితే మా వోళ్లు.. అదిగో సీఐ వస్తాడు ఎస్ ఐ వస్తాడు పట్టుకుంటాడు అని భయపడుతున్నారు. మీరు ఇక నుంచి రావొద్దు. మా పేకాట జోలికి మీకేం పని? `` అని పోలీసులను ఉద్దేశించి ప్రశ్నించాడు ఆయన. ఇక తన ప్రసంగాన్ని ముగిస్తానని చెప్పడంతో తమ్ముళ్లు మరికొంచెం సేపే మాట్లాడాలని బలవంతం చేశారు.

దీనికి స్పందించిన బాబు.. `` పో! పోయి నాకో క్వార్టర్ పట్రా. అప్పుడు మాట్లాడతా!`` అని తన అనుచరుడికి పిలుపునిచ్చారు. ఇదంతా కూడా మీడియా లైవ్‌లోనే ఉండడంతో సామాజిక మాధ్యమాల్లో తెలుగు దేశం పార్టీ నేతల అసలు స్వరూపంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి బాబుగారు దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి. లేకపోతే.. ఆర్టీవో అధికారిని ఎంపీ కేశినేని నాని బండ బూతులు తిట్టినా సెటిల్ చేసినట్టే.. ఇప్పుడు కూడా సెటిల్‌మెంట్‌కే తెరదీస్తారో చూడాలి. మొత్తానికి మాగంటి పోలీసులను అదుపులో పెట్టిన తీరు స్పష్టమైంది.