కొరడాలతో కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు!

Thu Apr 12 2018 14:50:04 GMT+0530 (IST)

ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై కేంద్రం వైఖరికి నిరసనగా టీడీపీ కొద్ది రోజులుగా రకరకాల నిరసనలు తెలుపుతోన్న సంగతి తెలిసిందే. బీజేపీ ఎన్డీఏతో మిత్రబంధాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తెంచుకున్న తర్వాత టీడీపీ కార్యకర్తలు నేతలు ....బీజేపీకి బద్ధ శత్రువులయిపోయారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో అంటకాగిన తెలుగు తమ్ముళ్లకు హఠాత్తుగా కొద్ది రోజుల క్రితం జ్ఞానోదయం అయినట్లుంది. ఇప్పటివరకు మోదీని పల్లెత్తు మాట అనని చంద్రబాబు కూడా విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. ఆయనకు వంత పాడుతూ తెలుగు తమ్ముళ్లు నానా పాట్లు పడుతూ కేంద్రంపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఏలూరు ఎంపీ మాగంటి బాబు - ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఒకరినొకరు కొరడాలతో కొట్టుకుంటూ వినూత్న తరహాలో నిరసన తెలిపారు.కేంద్రం వైఖరికి నిరసనగా టీడీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలలో టీడీపీ కార్యకర్తలు - నేతలు పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో జరిగిన నిరసన కార్యక్రమంలో మాగంటి బాబు - గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు కొరడాలతో కొట్టుకుంటూ....వెరైటీగా నిరసత తెలిపేందుకు ప్రయత్నించారు. 5 కోట్ల ఆంధ్రులను ప్రధాని మోదీ మోసం చేశారని ఏపీ నుంచే మోదీ పతనం ప్రారంభమైందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. అయితే ఇప్పుడు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపిన తమ్ముళ్లందరూ....నాలుగు సంవత్సరాలపాటు ఏమయ్యారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హోదా అంటే జైలుకు వెళ్లాల్సిందేనని ....చంద్రబాబు చెప్పినపుడు వీరంతా వంతపాడారని ఇపుడు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ మోదీపై మండిపడుతున్నట్లు నటిస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.