డబ్బులు ఎగ్గొట్టిన కేసులో రజనీకి కోర్టు నోటీస్

Fri Jan 19 2018 19:07:51 GMT+0530 (IST)


సూపర్ స్టార్ రజనీ రాజకీయ రంగప్రవేశం ముందు అనేక అగ్నిపరీక్షలు ఎదరవుతున్నాయి. ఇప్పటికే ఆయన రాజకీయ ప్రవేశంపై పలువురు సినీ ప్రముఖులు మండిపడుతుండగా...తాజా ఆయనకు ఆస్తుల కేసులో కోర్టు నోటీసు వచ్చింది. అయితే ఇది ఆయన వల్ల కాకుండా...ఆయన వియ్యంకుడి వల్ల కావడం గమనార్హం. రజనీ అల్లుడు దనుష్ తండ్రి - ప్రముఖ తమిళ దర్శకుడు కస్తూరి రాజా వల్ల ఈ శ్రీముఖం వచ్చింది.తాజాగా నోటీసులు అందింన ఈ కేసులో ఆరేళ్లుగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతోంది. ముకుంద్ బోత్రా అనే ప్రముఖ ఫైనాన్షియర్ మైహున్ రజనీకాంత్ అనే సినిమా నిర్మించడానికి సిద్ధం అయ్యారు. ఆ సందర్బంలో ఆయన రజనీ వియ్యంకుడు కస్తూరి రాజాను కలిశారు. సహజంగానే ఆ ఇద్దరూ ఆర్థిక లావాదేవీలు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ పేరుతో సినిమా తీస్తున్నామని అందుకు అనుమతి ఇప్పించాలని ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రా తన మనసులోని మాటను బయటపెట్టారు. దీంతో రజనీ వియ్యంకుడు అయిన కస్తూరి రాజా ఆయనకు హామీ ఇచ్చారు. రజనీకాంత్ పేరుతో తీసే సినిమాకు తాను అనుమతి ఇప్పిస్తానని అందు కోసం రూ. 40 లక్షలు గుడ్ విల్ ఇవ్వాలని చెప్పిన కస్తూరి రాజా ఆ మొత్తం నగదు తీసుకున్నారు.

స్వయంగా సూపర్ స్టార్ వియ్యంకుడి నుంచి అనుమతి రావడంతో  ఫైనాన్షియర్ ముకుంద్ సంత్ బోత్రా తన కలల ప్రాజెక్ట్ అయిన మైహున్ రజనీకాంత్ సినిమా మొదలుపెట్టేశారు. ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన కస్తూరి రాజా తనకు రూ. 25 లక్షలు అవసరం ఉందని - తాను ఇవ్వకుంటే రజనీకాంత్ ఇస్తారని చెప్పారు. అంతేకాకుండా లిఖితపూర్వకంగా బాండు రాసి సంతకం చేసి చెక్ లతో సహ ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రాకు ఇచ్చాడు.

అయితే సినిమా పూర్తి అవుతున్న సమయంలో ఈ విషయం రజనీకి తెలిసింది. తనకు తెలియకుండా...తన పేరుతో సినిమా తీస్తుండటంతో రజనీ అవాక్కయ్యారు. దీంతో  తన పేరుతో సినిమా తీసేందుకు ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదని సినిమా విడుదల కాకుండా స్టే ఇవ్వాలని రజనీకాంత్ కోర్టును ఆశ్రయించారు. దీంతో స్టే వచ్చింది. దీంతో అవాక్కడం బోత్రా వంతయింది. మరోవైపు కస్తూరి రాజా ఇచ్చిన చెక్ లు బ్యాంకులో వెయ్యగా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని ఫైనాన్షియర్ ఎలాగోలా రజనీకాంత్ ను కలిశారు. ఆయన వియ్యంకుడు రాసిన బాండు చూపించి నగదు ఇవ్వాలని కోరారు. అయితే రజనీ దానికి నో చెప్పారని... తనపేరు చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారని తనకు సంబంధం లేదని రజనీకాంత్ సమాధానం ఇచ్చారని ముకుంద్ బోత్రా ఆరోపించారు. అయితే తన ప్రయత్నం విడిచిపెట్టకుండా...చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు బోత్రా. అయితే వారు విచారణ చెయ్యకుండానే కేసు మూసి వేశారని ఆరోపిస్తూ ముకుంద్ బోత్రా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు కౌంటర్ దాఖలు చెయ్యడంతో మద్రాసు హైకోర్టు ముకుంద్ బోత్రా పిటిషన్ విచారణకు తిరస్కరించింది. అయినప్పటికీ...తన ప్రయత్నాన్ని వదిలిపెట్టని బోత్రా మద్రాసు హైకోర్టు తన పిటిషన్ విచారణకు స్వీకరించలేదని సుప్రీం కోర్టును ఆశ్రయించిన ముకుంద్ బోత్రా విచారణకు అనుమతి తీసుకు వచ్చి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణకు వచ్చింది.

దీంతో న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. `మీ వియ్యంకుడి ఆర్థిక లావాదేవీల విషయంలో మీకు సంబంధం ఉంది తాను నగదు ఇవ్వకుంటే మీరు ఇస్తారని కస్తూరి రాజా చెప్పారని పిటిషనర్ చెప్తున్నారు. బ్యాంకులో చెక్ లు బౌన్స్ అయ్యాయని - ఈ కేసుతో మీకు ఎలాంటి సంబంధం ఉందో వివరణ ఇవ్వండి` అని న్యాయమూర్తి రజనీకి నోటీసులు జారీ చేసి విచారణ వాయిదా వేశారు.