కొడుకు ఫెయిల్ అయితే పండగ చేసిన తండ్రి!

Wed May 16 2018 20:57:36 GMT+0530 (IST)

కొడుకు ఫెయిల్ కావటం ఏమిటి?  తండ్రి సంబరం చేయటం ఏమిటి?  కొడుకు మీద కోపంతో తండ్రి కొత్త తరహా గాంధీ గిరి చేశాడా? అంటే తప్పులో కాలేసినట్లే. నిజంగానే ఆ తండ్రి అనుసరించిన వైనం ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడైనా కొడుకు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆగ్రహం చెందటం.. చెడామడా తిట్టటం.. పనికిరాని వెధవ అంటూ చులకన చేయటం.. తీవ్రమైన విషాదంలో కూరుకుపోవటం లాంటివి మామూలే.ఇందుకు భిన్నంగా తన కొడుకు ఫెయిల్ అయితే పండగే చేశాడా తండ్రి. ఎందుకిలా అంటే.. జీవితంలో పరీక్ష ఒకటే కాదని.. చాలా ఉన్నాయని.. ఆ విషయాన్ని కొడుక్కి చెప్పటం కోసమే. ఇటీవల మధ్యప్రదేశ్ లో పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. జీవితంలో పరీక్షలు ఒక భాగమే తప్ప.. అదే జీవితం కాదు. ఆ విషయాన్ని గుర్తించని తల్లిదండ్రులు.. పిల్లల కారణంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇలాంటి వాటికి చెక్ చెప్పేలా.. తన కొడుకు ఫెయిల్ కారణంగా అస్సలు బాధ పడకూడదన్న సదుద్దేశంతో ఒక తండ్రి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. తండ్రితో పాటు..  ఆ కుటుంబ సభ్యులంతా ఫెయిల్ అయినా పండగ చేశారు. ఫెయిల్ అయిన కొడుక్కి పూల బొకే ఇచ్చిన తండ్రి.. అస్సలు బాధ పడొద్దన్నాడు. జీవితంలో పరీక్షల్లో పాస్ కావటం ఒక్కటే కాదని.. చాలానే ఉన్నాయని ఊరడించారు. వీధిలోకి వచ్చి అందరికి స్వీట్లు పంచిందా కుటుంబం.

పెద్ద ఎత్తున మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించి.. టపాసులు పేల్చారు. కొడుకు ఫెయిల్ అయితే ఇలా వేడుక చేయటం ఎందుకని అడిగిన స్థానికులకు.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారని.. జీవితంలో ఇదే చివరి పరీక్ష కాదు కదా? అందుకే.. ఇలా వేడుక చేస్తున్నట్లుగా కుర్రాడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. నాలుగు సబ్జెక్టులలో ఫెయిల్ అయిన కొడుకును విభిన్నంగా రియాక్ట్ అయిన కుటుంబంపై పలువురు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

చివరకు ఫెయిల్ అయిన కుర్రాడు సైతం.. తన ఫ్యామిలీ రియాక్షన్ పై తాను ఆశ్చర్యపోయినట్లుగా వెల్లడించాడు. తనకు ఇక చదువుకోవాలని లేదని.. తండ్రి ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ చూసుకోవాలని ఉన్నట్లు చెప్పాడు. ఇదిలా ఉండగా.. సోమవారం మధ్యప్రదేశ్ లో విడుదలైన టెన్త్ ఫలితాల్లో ఫెయిల్ అయిన 11 మంది ఆత్మహత్యలు చేసుకోవటం గమనార్హం.