Begin typing your search above and press return to search.

వంద మంది రేపిస్ట్‌ ల‌ను ఆమె ఎందుకు క‌లిసింది?

By:  Tupaki Desk   |   13 Sep 2017 4:40 AM GMT
వంద మంది రేపిస్ట్‌ ల‌ను ఆమె ఎందుకు క‌లిసింది?
X
వ‌య‌సుతో సంబంధం లేదు. మ‌న‌సుతో అస్స‌లు ప‌ని లేదు. పశువుల కంటే ఘోరంగా త‌మ లైంగిక వాంఛ తీర్చుకునే మృగాళ్ల మ‌న‌సుల్లో ఏం ఉంటుంది? మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు ఎందుకు చేస్తారు? వారిని అత్యాచారాలు చేసేలా ఏం అంశాలు పురిగొల్పుతాయి? ఇంత దారుణ‌మైన‌.. హీన‌మైన ప‌నులు చేసేందుకు ప్రేరేపించే అంశాలేమిటి? ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికే ప్ర‌య‌త్నం చేసింది 26 ఏళ్ల యువ‌తి. ఆమే మ‌ధుమిత పాండే.

ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆ యువ‌తి బ్రిట‌న్ లోని ఆంగ్లియా ర‌స్కిన్ వ‌ర్సిటీలో క్రిమినాల‌జీ విభాగంలో పీహెచ్ డీ చేస్తోంది. త‌న రీసెర్చ్ పేప‌ర్ ను స‌బ్ మిట్ చేసే ప‌నిలో భాగంగా పెద్దెత్తున‌ రేపిస్ట్ ల‌ను క‌లిసి వారిని ఇంట‌ర్వ్యూ చేయాల‌ని భావించింది. ఇందులో భాగంగా గ‌డిచిన మూడేళ్ల‌లో వంద మందికి పైగా అత్యాచార నేరాల్లో ఖైదీలుగా శిక్ష అనుభ‌విస్తున్న వారితో మాట్లాడారు.

వారితో మాట్లాడిన సంద‌ర్భంగా వారేం అనుకుంటున్నార‌న్న విష‌యాల్ని తాజాగా ఆమె వెల్ల‌డించింది. అత్యాచార నేర‌గాళ్లు న‌ర‌రూప రాక్ష‌సులు.. మ‌నిష‌న్న‌వాడు అలాంటి దారుణ‌మైన ప‌నులు చేయ‌డ‌న్న‌ది చాలామంది అభిప్రాయ‌మ‌ని.. కానీ తీహార్ జైల్లో రేప్ చేసినందుకు శిక్ష‌లు అనుభ‌విస్తున్న వారిలో అత్య‌ధికులు నిర‌క్ష‌రాస్యులుగా ఆమె చెప్పారు. కొద్దిమంది మాత్ర‌మే పాఠ‌శాల విద్య‌ను పూర్తి చేసిన‌ట్లుగా చెప్పారు. వారేమీ అసాధార‌ణ‌మైన వ్య‌క్తులు కాద‌ని.. వారు పుట్టి పెరిగిన వాతావ‌ర‌ణం.. ఆలోచ‌న‌ధోర‌ణులే వారిని అలాంటి నేరాల‌కు పురికొల్పేలా చేశాయ‌ని చెప్పారు.

లైంగిక విద్య‌కు దూరంగా ఉండ‌టం.. అవ‌గాహ‌న లేక‌పోవ‌టం.. అత్యాచారం అంటే ఏమిటో వివ‌రించ‌క‌పోవ‌టం లాంటివి ఒక కార‌ణంగా చెప్పిన మ‌ధుమిత‌.. మ‌గ‌వాళ్ల‌కు .లైంగిక‌ప‌ర‌మైన అంశాల్లో అవ‌గాహ‌న లేకుండా పోతుంద‌ని పేర్కొన్నారు. జైలుశిక్ష అనుభ‌విస్తున్న అత్యాచార నేర‌గాళ్ల‌లో రేప్ అంటే ఏమిటో తెలీద‌ని చెప్పారు. తాము ఆ త‌ర‌హా నేరానికి పాల్ప‌డ్డామ‌న్న భావ‌న‌లో ఉన్న వారు కొద్దిమందే ఉన్నార‌ని చెప్పారు. మ‌రింత షాకింగ్ విష‌యం ఏమిటంటే.. శృంగారానికి మ‌హిళ అంగీకారం అవ‌స‌ర‌మ‌న్న ఆలోచ‌న‌లు చాలామందికి తెలీవ‌న్న విష‌యం వాళ్ల‌తో మాట్లాడిన సంద‌ర్భంగా త‌న‌కు తెలిసింద‌న్నారు.

నేర‌గాళ్ల‌ల‌లో కొంద‌రు తాము చేసింది త‌ప్పేన‌ని ఒప్పుకోవ‌టంతో పాటు.. తీవ్ర ప‌శ్చాత్తాపాన్ని వ్య‌క్తం చేశార‌ని.. ఒక వ్య‌క్తి విష‌యంలో తాను షాక్‌కు గుర‌య్యాన‌న్నారు. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్ప‌డిన నేర‌స్తుడు.. త‌న శిక్ష పూర్తి అయి జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన‌ప్పుడు త‌న నోట మాట రాలేద‌న్నారు. అత్యాచారాలకు అస‌లు కార‌ణాలు వెత‌క్కుండా నేర‌స్తుల్ని శిక్షిస్తేనే.. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కాద‌న్న అభిప్రాయాన్ని ఆమె వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.