Begin typing your search above and press return to search.

సీపీఎం నేత మధు మేనల్లుడి హత్య

By:  Tupaki Desk   |   25 May 2016 8:58 AM GMT
సీపీఎం నేత మధు మేనల్లుడి హత్య
X
రెండు రోజుల కిందట అదృశ్యమై బుధవారం ఉదయం హైదరాబాద్ లో శవమై కనిపించిన సాఫ్టువేర్ ఇంజనీర్ వల్లిపల్లి హష్మి ఎవరో కాదు.. ఆయన ఏపీ సీపీఎం కార్యదర్శి మధుకు స్వయానా మేనల్లుడని తెలుస్తోంది. హష్మి హత్యతో మధు కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

హైదరాబాద్ లోని లింగంపల్లి వద్ద రైలు పట్టాల పక్కన హష్మి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు చెందిన హష్మి.. సీపీఎం నేత మధుకు మేనల్లుడు. వారం కిందట ఆయన టీసీఎస్ సంస్థలో సాఫ్టువేర్ ఇంజినీర్ గా చేరారు. హష్మిని ఆయన పొరుగింట్లో నివసించే స్నేహితుడు నరేశే చంపినట్లు పోలీసులు తేల్చారు. నరేశ్ డబ్బు కోసమే ఈ హత్యను చేసినట్టు పోలీసులు వెల్లడించారు. హష్మి వద్ద ఉన్న రూ. 10 వేలు, బంగారు గొలుసు కోసం అతన్ని రాళ్లతో తలపై మోది చంపినట్టు తెలిపారు.

వేవ్ రాక్ సంస్థలో పనిచేసే హష్మి వారం కిందటే టీసీఎస్ లో చేరారు. సోమవారం రాత్రి డ్యూటీ ముగిసిన తరువాత ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కాగా.. హష్మి - నరేశ్ లు లింగంపల్లి వెళ్లగా అక్కడ 10 వేలు కావాలని నరేశ్ అడిగాడు. లేవని చెప్పడంతో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. నరేశ్ బండరాయితో మోదడంతో హష్మి మరణించినట్లు పోలీసులు తేల్చారు. తొలుత నరేశ్ ను ప్రశ్నించినప్పుడు బుకాయించినా ఆ తరువాత పోలీసులు ఆధారాలు సేకరించి గట్టిగా నిలదీసే సరికి నేరం ఒప్పుకున్నాడు. హష్మి మృతితో సీపీఎం నేత మధు కుటుంబం విషాదంలో మునిగిపోయింది.