ఏపీలో ఆ నటికి భారీ షాకిచ్చారుగా!

Sat May 25 2019 11:23:23 GMT+0530 (IST)

రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకున్నా.. సినిమాల్లో తమకున్న పేరు ప్రఖ్యాతుల్లో ఎన్నికల బరిలో దిగారు పలువురు నటీమణులు. అలా దిగిన వారిలో పలువురికి చేదు అనుభవం ఎదురైంది. సీనియర్ నటి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా ఘన విజయం సాధిస్తే.. మరో తెలుగు నటి ఊహించని రీతిలో మట్టికరిచారు. ఆమె ఓటమి మీద పెద్ద ఆశ్చర్యం లేకున్నా.. ఆమెకు వచ్చిన ఓట్ల లెక్క తెలిస్తేనే అవాక్కు అయ్యే పరిస్థితి.తెలుగులో పలు సినిమాలు చేసి.. ప్రస్తుతం యూట్యూబ్ లో ఎక్కువగా కనిపిస్తున్న నటి మాధవీలత. అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగుతెరకు పరిచయమైన ఆయన.. తన మాటలతో.. చేతలతో ఆమె వార్తల్లో వ్యక్తిగా మారారు. మధ్యలో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా ఈ మధ్యన ఆమె యూట్యూబ్ లోనూ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉన్నారు.

తాజాగా ఆమె గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వాస్తవానికి మాధవీలతకు బీజేపీ టికెట్ రావటమే ఆసక్తికరంగా మారింది.  ఎన్నికల బరిలోకి దిగిన ఆమె పెద్ద ప్రభావాన్ని చూపించలేదన్న మాట వినిపించింది. దీనికి తగ్గట్లే ఆమె ఎన్నికల్లోఓటమి చెందారు. కాకుంటే.. ఆమెకు వచ్చిన ఓట్లు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

మాధవీలతకు కేవలం 1900 ప్లస్ ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఓట్లు మొత్తం బీజేపీ సంప్రదాయ ఓట్లు తప్పించి.. మాధవీలతను చూసి ఎవరూ ఓట్లు వేయలేదన్న విషయం అర్థమవుతుంది. అదే సమయంలో జగన్ ఫ్యాన్ గాలి దూమారాన్ని తట్టుకొని ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి మద్దాల గిరి విజయం సాధించారు.ఆయనకు 71800 ఓట్లు రావటం గమనార్హం.