Begin typing your search above and press return to search.

తెలుగు స‌భ‌ల మీద వినిపించ‌ని 'మా తెలుగు త‌ల్లి'

By:  Tupaki Desk   |   12 Dec 2017 7:06 AM GMT
తెలుగు స‌భ‌ల మీద వినిపించ‌ని మా తెలుగు త‌ల్లి
X
మ‌రో మూడు రోజుల్లో మొద‌లు కానున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు సంబంధించి జ‌రుగుతున్న ఏర్పాట్లు చూస్తే.. తెలుగు మ‌హా స‌భ‌లు అనే క‌న్నా.. ప్ర‌పంచ తెలంగాణ మ‌హాస‌భ‌లు అన‌టం బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఉద్య‌మ రోజుల్లో విడిపోయి క‌లిసి ఉందామ‌న్న నినాదానికి భిన్న‌మైన ధోర‌ణి ఇప్ప‌టి తెలంగాణ‌లో చోటు చేసుకోవ‌టం తెలిసిందే.

రాష్ట్రాలుగా విడిపోయినా.. రెండు చోట్ల ఉండేది తెలుగే. మాట్లాడేది ఒకే భాష‌. కానీ.. భాష‌లోని యాస‌ల్ని ఆధారంగా తీసుకొని అనుస‌రిస్తున్న ధోర‌ణి.. ఒక రాష్ట్రం వారికి పెద్ద‌పీట వేస్తూ.. రెండో రాష్ట్రం వారిని క‌నీసం ఆహ్వానించ‌కుండా ఉంటున్న తీరు ఇప్పుడు విచిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌.. హైద‌రాబాద్‌ లో జ‌రుగుతున్న ప్ర‌పంచ మ‌హాస‌భ‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాన్ని కొన్ని ప‌త్రిక‌లు ఏపీలో క‌వ‌రేజ్ కూడా ఇవ్వ‌టం మానేశాయి.

హైద‌రాబాద్‌ లో జ‌రిగేది ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు అన్న విష‌యాన్ని మీడియా యాజ‌మాన్యాలు మ‌ర్చిపోతున్నాయా? అన్న సందేహం రాక మాన‌దు. స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యే వారి ద‌గ్గ‌ర నుంచి అతిధుల వ‌ర‌కూ వీలైనంత వ‌ర‌కూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి మ‌త్ర‌మే ప్రాధాన్య‌త ఇవ్వ‌టం.. దీన్ని త‌ప్పుగా ఎవ‌రూ గుర్తించ‌క‌పోవ‌టం క‌నిపిస్తోంది. ఒక ఇంటిపేరున్న ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు విడిపోతే.. ఎవ‌రి దారిన వారు బ‌త‌కటం కామ‌నే. కానీ.. త‌మ ఇంటిపేర్ల‌ను కూడా మార్చేసుకోరు. అంతేకాదు.. వారి దాయాదుల ఇళ్ల‌ల్లో శుభ‌.. అశుభ కార్య‌క్ర‌మాలు జ‌రిగిన‌ప్పుడు అందుకు సంబంధించిన క‌ర్మ‌ల్ని నిర్వ‌హించ‌టం మామూలే. ఇలాంటి తీరు తెలంగాణ రాష్ట్రం నిర్వ‌హిస్తున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో క‌నిపించ‌క‌పోవ‌టం మ‌ర్చిపోకూడ‌దు. విభ‌జ‌న త‌ర్వాత టీటీడీ బోర్డులో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక‌రికి స్థానం క‌ల్పించిన రీతిలో.. తెలంగాణ‌లో నిర్వ‌హించే ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో ఏపీ ప్రాంతానికి చెందిన వారికి ఒకింత ప్రాధాన్య‌త ఇస్తే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కానీ.. అలాంటివేమీ జ‌ర‌గ‌టం లేదు.

అంతేకాదు.. తెలుగువారికి ఎంతో ఇష్ట‌మైన మా తెలుగు త‌ల్లికి మ‌ల్లెపూల‌ దండ..మా క‌న్నత‌ల్లికి మంగ‌ళ‌హార‌తులంటూ పాడుకునే పాట కూడా ప‌క్క‌న పెట్టేయ‌టం క‌నిపిస్తుంది. ఆ పాట స్థానే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొత్త పాట‌ను రాయించారు. అచార్య న‌టేశ్వ‌ర శ‌ర్మ రాసిన పాట‌ను వినిపించ‌నున్నారు. ఈ పాట‌ను అధ్యాత్మిక పాట‌ల్ని ఆల‌పించే నిత్య సంతోషిని చేత పాడించారు. మా తెలుగు త‌ల్లి పాట‌కు బ‌దులుగా ఈ పాట‌ను ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో వినిపించ‌నున్నారు.

అంతేకాదు.. తెలుగుకు మూలం తెలంగాణ ప్రాంత‌మ‌న్న విష‌యాన్ని ఈ స‌భ‌ల ద్వారా చెప్ప‌బోతున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే క్రీస్తుపూర్వం 300 ఏళ్ల కింద‌టే ప్ర‌స్తుత అమ‌రావ‌తి రీజియ‌న్ లో భాగ‌మైన భ‌ట్టిప్రోలులో తెలుగు ఆన‌వాళ్లు క‌నిపిస్తున్న ప‌రిస్థితి. పాల‌నా సౌల‌భ్యం.. ప్ర‌జ‌లకు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉండేందుకు.. వారి జీవ‌న‌శైలిని మ‌రింత బాగా మెరుగుప‌ర్చేందుకు భౌగోళికంగా విడిపోయిన తెలుగు ప్ర‌జ‌లు.. ఈ రోజు తెలుగు భాష‌కు సంబంధించిన చ‌రిత్ర‌ను త‌మ‌దైన శైలిలో అన్వ‌యం చెప్పుకోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.