Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు జాతీయ సీన్ ఉందా...

By:  Tupaki Desk   |   21 Sep 2018 4:51 PM GMT
కేసీఆర్ కు జాతీయ సీన్ ఉందా...
X
లోక్‌ సభ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - అపధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్రంలో చక్రం తప్పనున్నారా... జాతీయ రాజకీయాలను ఆయనే శాసించనున్నారా.... జాతీయ పార్టీలైన కాంగ్రెస్ - భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని కల్వకుంట్ల వారే ఏర్పాటు చేయనున్నారా... ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు. రానున్న ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జాతీయ స్థాయిలో కీలకం కానున్నారని - ఆయన ఆధ్వర్యంలోనే జాతీయ రాజకీయాలు నడవనున్నాయని తెరాస ఎంపీ వినోద్ అంటున్నారు. సార్వత్రిక ఎన్నిలక తర్వాత జాతీయ రాజకీయాలలో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయని వాటికి తమ నాయకుడు కె. చంద్రశేఖర రావే నేత్రుత్వం వహిస్తారని వినోద్ అంటున్నారు. అయితే జాతీయ స్థాయిలో తమ నాయకుడు చక్రం తిప్పిన తెలంగాణను మాత్రం వదలరని - అది ఆయన మానస పుత్రిక అని వినోద్ అన్నారు. తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన కుమారుడు తారక రామారావు కోసం ముందస్తుకు వెళ్లడం - రాజకీయ పావులు కదపడంపై వస్తున్న వార్తలను ఆయన ఖండిచారు.

ఎన్నికలకు 9 నెలల ముందుగానే సభను రద్దు చేయడం సరైన నిర్ణయమేనని తేరాస నాయకులు సమర్ధించుకుంటున్నారు. ప్రజలకు తాము ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెడతామన్న కేసీఆర్ అదే పని చేసారని - అంటున్నారు. ఇదే అంశంపై ఎంపీ వినోద్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తమకు ఎన్నికల భయం లేదని - తెలంగాణ ప్రజలు తమ పట్ల విశ్వాసంతో ఉన్నారని - దానిని నిరూపించుకుందుకే ముందస్తు ఎన్నికలకు వెడుతున్నామని వినోద్ చెబుతున్నారు. దీని ప్రభావం జాతీయ స్థాయిలో కూడా ఉంటుందని - రానున్న రోజులలో ప్రాంతీయ పార్టీలదే పైచేయి అవుతుందనేందుకు తెలంగాణ ఎన్నికలే నిదర్శనమని - వినోద్ అన్నారు. కుటుంబపాలనకు నాంది పలికింది కాంగ్రెస్ పార్టీయేనని - అయితే తెలంగాణ రాష్ట్ర సమితిలో మాత్రం ఆ సాంప్రదాయం ఉండదని తేరాస నాయకులు చెబుతున్నారు. అలాగే దేశంలో ముందస్తు ఎన్నికలకు ముందుగా తెర తీసింది దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీయేనని - ఆ సాంప్రదాయన్ని భారతీయ జనతా పార్టీ కొనసాగించిందని తేరాస నాయకులు అన్నారు. ఎన్నికల షేడ్యూల్‌ కు మూడు - నాలుగు నెలల ముందు ఎన్నికలు జరగడాన్ని ముందస్తు అనరని - ఓ కొత్త వాదానికి తేరాస ఎంపీ తెర తీసారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబర్ చివరి వారంలో కాని - డిశంబర్ మొదటి వారంలో కాని జరుగుతాయని ఎంపీ వినోద్ ప్రకటించడం కొసమెరుపు