Begin typing your search above and press return to search.

ఆంధ్రా ప్రజలకు తొందరెక్కువంటున్న అవంతి

By:  Tupaki Desk   |   5 May 2016 5:55 AM GMT
ఆంధ్రా ప్రజలకు తొందరెక్కువంటున్న అవంతి
X
ఒకరి తర్వాత ఒకరుగా ఆంధ్రోళ్లను ఆడేసుకుంటున్న వైనం చూస్తున్నదే. రాష్ట్ర విభజన విషయంలో ఏపీ ప్రజల వాదనను ఏ మాత్రం పట్టించుకోకుండా నాటి యూపీఏ సర్కారు ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు బోలెడన్ని హామీలు ఇవ్వటం.. ఈ హామీల్ని చూసి కాస్త ఉపశమనంగా ఫీలైన ఏపీ ప్రజానీకానికి మోడీ సర్కారు షాకుల మీద షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సాధ్యకాదని తేల్చేసిన కేంద్రం.. విశాఖకు రైల్వే డివిజన్ విషయంలోనూ సాధ్యం కాదన్న మాటను చెబుతోంది. దీనిపై కరాఖండి ప్రకటన ఇంకా రానప్పటికీ.. ప్రత్యేక జోన్ విషయంలోనూ నీళ్లు వదులుకోవాల్సి ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తినేలా వ్యవహరిస్తున్న కేంద్రం తీరుపై గుస్సా ప్రదర్శించిన ఎంపీ అవంతి శ్రీనివాస్.. ఆంధ్రా ప్రజలకు తొందరెక్కువని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచిన పక్క రోజు నుంచే ప్రత్యేకహోదా ఇవ్వలేదని.. విశాఖకు ప్రత్యేక జోన్ కేటాయించలేదని అనటం సరికాదని చెబుతున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ షురూ చేయగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదని.. పదమూడేళ్ల సమయం పట్టిందంటూ అవంతి గుర్తు చేయటం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మొండిచేయి చూపటంలో సీమాంధ్రులు మండిపడుతున్న వేళ.. ఎంపీ అవంతి మాటలు మరింత ఇరిటేటింగ్ గా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా గురించి రెండేళ్లుగా ఏపీ ప్రజలు ఆశగా ఎదురుచూసిన విషయం తెలిసినప్పటికీ అవంతి అందుకు భిన్నంగా.. ఆంధ్రోళ్లకు తొందరెక్కువని వ్యాఖ్యానించటం సరికాదన్న మాట వినిపిస్తోంది. తమ వైఫల్యాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో ప్రజల్ని చులకన చేసేలా మాట్లాడటం అవంతికి మంచిది కాదంటూ పలువురు మండిపడుతున్నారు. అవంతి మాటలు చూస్తుంటే.. ఏపీ ప్రత్యేక హోదా కోసం కూడా కేంద్రంతో ఓ పుష్కరకాలం పోరాడాలా ఏంటి..? ఓట్లేసి అధికారాన్ని అప్పగించిన ప్రజల్ని చులకన చేస్తూ.. వారి భావోద్వేగాల్ని ఎటకారం చేస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయం అవంతి లాంటి నేతలకు ఆంధ్రోళ్లు స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.