Begin typing your search above and press return to search.

ముంబ‌యిలో రాజుకున్న గుజ‌రాతీ మంట‌

By:  Tupaki Desk   |   19 March 2018 10:45 AM GMT
ముంబ‌యిలో రాజుకున్న గుజ‌రాతీ మంట‌
X
దేశంలో ప్రాంతీయ‌వాదాల‌కు కొద‌వ లేదు. అందునా మ‌హారాష్ట్రలో గుజ‌రాతీ వ్య‌తిరేక‌త అప్పుడ‌ప్పుడు తెర మీద‌కు వ‌స్తుంది. ఇలా వ‌చ్చిన ప్ర‌తిసారీ ముంబ‌యి మ‌హాన‌గ‌రంలోని గుజ‌రాతీ ఆస్తుల్ని టార్గెట్ చేయ‌టం క‌నిపిస్తుంది. అలాంటిదే మ‌రోసారి తెర మీద‌కు వ‌చ్చింది. మోడీ ముక్త భార‌త్ నినాదాన్ని వ‌ల్లె వేస్తున్న మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే ఇచ్చిన పిలుపు నేప‌థ్యంలో.. ముంబ‌యిలో టార్గెట్ గుజ‌రాత్ సెగ మ‌ళ్లీ రాజుకుంది.

ముంబ‌యి శివాజీ పార్కు ద‌గ్గ‌ర ఏర్పాటు చేసిన స‌భ‌లో రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్య‌ల త‌ర్వాత ముంబ‌యిలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ముంబ‌యి శివారుల్లో వ‌సాయ్ లో న‌వ నిర్మాణ సేన కార్య‌క‌ర్త‌లు గుజ‌రాతీ దుకాణాల్ని టార్గెట్ చేసిన వైనం బ‌య‌ట‌కువ‌చ్చింది. గుజ‌రాతీలో ఏర్పాటు చేసిన సైన్ బోర్డుల్ని వారు ధ్వంసం చేసే ప్ర‌య‌త్నం చేశారు.

గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో కొన్ని ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఆ స‌మ‌యంలోనూ గుజ‌రాతీ డాబాల మీద‌.. గుజ‌రాతీ సైన్ బోర్డుల మీద మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ సేన కార్య‌క‌ర్త‌లు విధ్వంసానికి దిగారు. ముంబ‌యిలోని గుజ‌రాతీయ సైన్ బోర్డుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చే్స్తున్నారు. తాజాగా మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితే చోటు చేసుకుంది. గుజరాతీ భాష‌లో ఉన్న సైన్ బోర్డుల్ని తొల‌గించిన త‌ర్వాత మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ సేన కార్య‌క‌ర్త‌లు శాంతించారు. తాజాగా సిటీలోని ప‌లు దుకాణాల‌కు చెందిన గుజ‌రాతీ సైన్ బోర్డుల్ని తొల‌గించిన త‌ర్వాత సేన కార్య‌క‌ర్త‌లు శాంతించారు.