Begin typing your search above and press return to search.

సెల్వంకు షాకిచ్చిన సొంత ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   24 July 2017 6:54 AM GMT
సెల్వంకు షాకిచ్చిన సొంత ఎమ్మెల్యే
X
త‌మిళ‌నాడు రాజ‌కీయాలు మ‌లుపులు తిరుగుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల అనంతరం సీఎం పళనిస్వామికి కేంద్ర ప్రభుత్వం మద్దతు పెరుగుతుండడం, తమిళ మంత్రులకు కేంద్ర మంత్రులు ప్రాధాన్యతనిస్తుండటంతో అన్నాడీఎంకే పురచ్చి తలైవి శిబిరం నేత - మాజీ సీఎం పన్నీరు శిబిరంలోని ఎమ్మెల్యేలు ఆలోచనలో పడినట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా పన్నీరు సెల్వంకు కౌండం పాళయం ఎమ్మెల్యే వీసీ ఆరుకుట్టి షాక్‌ ఇచ్చారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం నాయకత్వంలోని పురత్చి తలైవి శిబిరాన్ని వీడి సీఎం పళనిస్వామి నేతృత్వంలోని శిబిరంలో ఆదివారం చేరారు. అరుకుట్టి త‌న‌మద్దతుదారులతో కలిసి చిన్నమ్మ్ణ శిబిరంలో చేరిపోయిన‌ట్లే మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు సైతం సెల్వంకు హ్యాండిచ్చి అమ్మ శిబిరం వైపు కదిలే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.

అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం అనంత‌రం ఏర్ప‌డిన గ్రూపు రాజ‌కీయాల కార‌ణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో చీలిక వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అమ్మ నెచ్చెలి శశికళ శిబిరంలో 122 మంది - పురచ్చి తలైవి శిబిరంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.పన్నీరు ప్రత్యేక శిబిరాన్ని ప్రకటించిన సమయంలో ఈ శిబిరంలోకి అడుగు పెట్టిన తొలి ఎమ్మెల్యే ఆరుకుట్టి. ఇప్పుడు బయటపడ్డ తొలి వ్యక్తి కూడా ఆయనే. దీంతో జంప్‌ జిలానీల సంఖ్య పెరగడం ఖాయం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పన్నీరు శిబిరం నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు త్వరలో అమ్మ శిబిరంలోకి రాబోతున్నారని ఆరుకుట్టి ప్రకటించారు.

తాజాగా ఆరుకుట్టి వెళ్లిపోవడంతో పన్నీరు సెల్వం శిబిరంలో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. మ‌రోవైపు ఆరుకుట్టి తమ శిబిరాన్ని వీడి వెళ్లడంపై పన్నీరు సెల్వం స్పందిస్తూ....త‌నంత తానుగా వచ్చారు.. ఆయనే వెళ్లారు.. పోతే పోనీ అని వ్యాఖ్యానించారు. అయితే పైకి గంభీరంగా ఉన్న‌ప్ప‌టికీ త‌న బృందంలో ఉన్న వాళ్లనైనా దక్కించుకునే ప్రయత్నాల్లో పడి పార్టీ వర్గాలతో సెల్వం మంతనాలు జరిపారు. ఈ మంతనాల్లో మెజారిటీ సభ్యులు పళని వర్గంతో మళ్లీ విలీన చర్చల నినాదాన్ని ముందుకు తీసుకొచ్చినట్టు సమాచారం. దీనిపై త్వ‌ర‌లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుందామ‌ని సెల్వం తెలిపిన‌ట్లు స‌మాచారం.