జగన్ కు భయపడి పింఛన్లు పెంచారు

Mon Jan 21 2019 18:16:44 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ తీవ్రవిమర్శలు చేశారు. కేవలం జగన్ ఇచ్చిన హామీలకు భయపడి ఆదరాబాదరాగా పింఛన్లు పెంచారని ఆరోపించారు. తన పాలన పై ధైర్యంగా ప్రజల ముందుకెళ్లే ధైర్యం లేని చంద్రబాబు.. ఇలా ఎన్నికలకు 2నెలల ముందు ప్రజల్ని వంచించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దుయ్యబట్టారు.హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన శ్రీకాంత్.. అన్ని రంగాల్లో టీడీపీ సర్కార్విఫలమైందని ఆరోపించారు. బీజేపీతో కలిసి ఉన్నన్ని రోజులు ఏనాడూ సమస్యలు పట్టించుకోని చంద్రబాబు.. ఎన్నికలు వస్తున్నాయని తెలిసి ప్రజలకు తాయిలాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఇచ్చేతాయిలాలు కూడా కంటితుడుపు మాత్రమేనని.. ఎన్నికల కోడ్ దృష్ట్యా రాబోయే రోజుల్లో అవి అమల్లోకి రావడం అసాధ్యమని అన్నారు శ్రీకాంత్.

ప్రజలకు ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం కోసం క్యాబినెట్ సమావేశాలు పెడుతున్నారని కూర్చొని కాఫీలు తాగడానికి తప్ప ఆ మీటింగ్ లు దేనికీ పనికిరావని ఆరోపించారు శ్రీకాంత్. తమకు అసెంబ్లీ పై ప్రజాస్వామ్యం పై పూర్తి నమ్మకం ఉందన్న శ్రీకాంత్.. పార్టీ మారిన ఎమ్మెల్యేల పై చర్యలు తీసుకుంటేనే అసెంబ్లీకి వస్తామని మరోసారి స్పష్టంచేశారు