Begin typing your search above and press return to search.

లోకేష్ కోసం వీర‌భ‌క్తి చాటుకోవ‌డం మొద‌లైంది

By:  Tupaki Desk   |   17 Feb 2019 1:05 PM GMT
లోకేష్ కోసం వీర‌భ‌క్తి చాటుకోవ‌డం మొద‌లైంది
X
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో తెలుగుదేశం పార్టీలో రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డుతున్నాయి. ఓ వైపు జంపింగ్‌ లు, ఫిరాయింపులు ఎత్తుగ‌డ‌లు కొన‌సాగుతున్న త‌రుణంలో మ‌రోవైపు ఆ పార్టీ నేత‌లు వీర‌భ‌క్తి ప్ర‌ద‌ర్శించ‌డం అనే ప్ర‌క్రియ సాగుతోంది. ఇందుకు కార‌ణం ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్‌. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో భాగంగా బ‌రిలో దిగ‌డం గురించి లోకేష్ క్లారిటీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తనకైతే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉందని మనసులోని మాటను చెప్పారు. కానీ నిర్ణ‌యం మాత్రం త‌న తండ్రి, ఏపీ సీఎం చంద్ర‌బాబుద‌ని సెల‌విచ్చారు. దీంతో ఆయ‌న‌కు త‌మ సీటు అప్ప‌గించేందుకు నేత‌లు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా ఓ సీనియ‌ర్ నేత ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేసేశారు కూడా!

ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల ఎంట్రీ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు లోకేష్‌ సమాధానం చెప్తూ, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రివర్గంలో ఉన్నాన‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాన‌ని వివ‌రించారు. 2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే విషయంపై మాత్రం నాన్నగారిదే ఫైనల్ డెసిషన్ అన్నారు. పోటీ చేయాలా..వద్దా అనే విషయం సీఎంగారే నిర్ణయిస్తారని వెల్లడించారు. లోకేష్ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆల‌స్యం వెంట‌నే ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఏకంగా బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేసి లోకేష్‌ ను త‌మ జిల్లాకు ఆహ్వానించారు.

కర్నూలు నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మంత్రి లోకేష్‌ ను ఆహ్వానించారు. కర్నూలు సీటును ఆయన కోసం త్యాగం చేస్తానని, మరో చోట టిక్కెట్ అడగనని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేసారు. అయితే లోకేష్ కు తప్ప, వేరేవాళ్లకి టిక్కెట్ ఇస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. వ‌చ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మంత్రి నారా లోకేష్ భావిస్తుండటంతో ప్రారంభ‌మైన ఈ ప్ర‌క‌ట‌న‌ల ప‌ర్వంలో ఇంకెంద‌రు నేత‌లు చేర‌తారో వేచి చూడాలి.