Begin typing your search above and press return to search.

గులాబీ ఎమ్మెల్యేకు రంగు ప‌డిందిగా!

By:  Tupaki Desk   |   20 Jan 2017 4:28 AM GMT
గులాబీ ఎమ్మెల్యేకు రంగు ప‌డిందిగా!
X
పూర్వాశ్ర‌మంలో టీడీపీలో ఉండి... ప్ర‌స్తుతం గులాబీ పార్టీ టీఆర్ ఎస్‌ లో కొన‌సాగుతున్న మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లా నారాయ‌ణ‌పేట ఎమ్మెల్యే రాజేంద‌ర్‌ రెడ్డికి నిజంగానే రంగు ప‌డిపోయింది. తెలుగు నాట రాజ‌కీయ వేత్త అవ‌తారం ఎత్తిన రాజేంద‌ర్ రెడ్డి... క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూరు కేంద్రంగా విద్యాసంస్థ‌ల అధినేత‌గా కొన‌సాగుతున్నారు. రాయ‌చూరులో ఓ మెడికల్ క‌ళాశాల‌తో పాటు మ‌రొన్ని విద్యా సంస్థ‌ల‌ను నెల‌కొల్పిన ఆయ‌న ఆ రంగంలో బాగానే రాణిస్తున్నారు. విజ‌య‌వంత‌మైన విద్యా సంస్థ‌ల అధినేత‌గా ఆయ‌న బాగానే డ‌బ్బు కూడా కూడ‌బెట్టారు. అయితే... సంపాదించిన మొత్తానికి స‌క్ర‌మంగా ప‌న్ను క‌ట్ట‌ని ఆయ‌న‌కు గ‌త కొంత కాలం క్రిత‌మే ఆదాయ‌ప‌న్ను శాఖ షాకిచ్చింది.

దాదాపు రూ.500 కోట్ల మేర సంపాద‌న‌కు ప‌న్ను క‌ట్ట‌ని రాజేంద‌ర్‌ రెడ్డి దాగుడుమూత‌ల‌ను ఐటీ శాఖ అధికారులు ఎట్ట‌కేల‌కు క‌నిపెట్టేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న అరెస్ట్ కావ‌డం కూడా ఖాయ‌మ‌న్న వాదనా వినిపించింది. ఈ క్ర‌మంలో అరెస్ట్ నుంచి త‌ప్పించుకునేందుకు ఆయ‌న గ‌తేడాది డిసెంబ‌రులో రాయ‌చూరు కోర్టును ఆశ్ర‌యించి అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రాజేంద‌ర్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ ను విచారించిన రాయ‌చూరు ప్రిన్సిప‌ల్ సెష‌న్స్ కోర్టు ఆయ‌న‌కు యాంటిసిపేట‌రీ బెయిల్ మంజూరు చేసింది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో నారాయ‌ణ‌పేట నుంచి టీడీపీ త‌ర‌ఫున అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన రాజేంద‌ర్ రెడ్డి అక్క‌డ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అయితే తెలంగాణ‌లో టీఆర్ ఎస్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు లొంగిపోయిన రాజేంద‌ర్ రెడ్డి ప‌చ్చ కండువా తీసేసి గులాబీ కండువా క‌ప్పుకున్నారు.

ఇది జ‌రిగిన కొన్నాళ్లకే ఐటీ శాఖ రాయ‌చూరులోని ఆయ‌న క‌ళాశాల‌లు, ఇళ్ల‌పై ఏక‌కాలంలో దాడులు చేసింది. ఈ సంద‌ర్భంగా రూ.20 కోట్ల న‌గ‌దుతో పాటు వంద‌ల కోట్ల విలువ చేసే స్థిరాస్తి ప‌త్రాలు ఐటీ అధికారుల‌కు దొరికిపోయాయి. ఈ వ్య‌వ‌హారంపై నాడే ఆయ‌న‌పై కేసులు న‌మోదు చేసిన ఐటీ శాఖ‌... ఆయ‌న ఆస్తుల‌పై సమ‌గ్ర ప‌రిశీల‌న జ‌రిపింద‌ట‌. ఈ ప‌రిశీల‌న‌లో రాజేంద‌ర్ రెడ్డి... రూ.500 కోట్ల‌కు అస‌లు ప‌న్నే క‌ట్ట‌లేద‌ని తేలింది. ఈ విష‌యాన్ని మ‌రింత ధృవీక‌రించుకున్న ఐటీ శాఖ నిన్న ఆయ‌న‌ను అరెస్ట్ చేసేందుకు నిన్న‌ రంగంలోకి దిగింది. అయితే విష‌యాన్ని ముందే ప‌సిగ‌ట్టిన రాజేంద‌ర్ రెడ్డి... దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు కూడా ఆయ‌న అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముంద‌స్తు బెయిల్ కోసం య‌త్నిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. మ‌రి ఈ సారి ఆయ‌న‌కు ఏమాత్రం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/