ఆ టీడీపీ ఎమ్మెల్యేకు కేటీఆర్ నచ్చేశాడు

Thu Jun 14 2018 23:00:05 GMT+0530 (IST)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మరోమారు ఆసక్తికరమైన వార్తతో తెరమీదకు వచ్చారు.కొద్దికాలం క్రితం వరకు టీఆర్ ఎస్ సర్కారు తీరుపై మండిపడిన టీడీపీ నాయకుడు - ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఇటీవల సీఎం కేసీఆర్ పై ప్రేమ చాటారు. రాష్ట్రంలోని బీసీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. ఆయనది గొప్ప మనసని ప్రశంసించారు. మహాత్మా జ్యోతిరావుఫూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. తన ప్రసంగంలో బీసీల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించారు. బీసీల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్నారని కొనియాడారు. అయితే తాజగా ఆయన తనయుడు తెలంగాణ ఐటీ - పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు.గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న శాసనసభ్యుడు ఆర్.కృష్ణయ్య పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ను ఆయన అమలు చేస్తున్నపథకాలను  ఆర్. కృష్ణయ్య ఆకాశానికి ఎత్తేశారు. అయితే తాజాగా ఈ పరంపరలో మరో ట్విస్ట్ జోడించారు. ఆర్. కృష్ణయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్బీనగర్‌లో జరిగిన 'మన నగరం' కార్యక్రమానికి హాజరైన కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆర్. కృష్ణయ్య... ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ ను విశ్వ నగరం చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని వెల్లడించిన కృష్ణయ్య ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా కోట్ల రూపాయాలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో టీడీపీ కుదేలు అయిపోతుండటం...మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతోనే..ఆర్.కృష్ణయ్య ఇలా చేస్తున్నారా? అనే చర్చ తెరమీదకు వస్తోంది. ఆర్.కృష్ణయ్యను తెలుగుదేశం పార్టీ సరైన రీతిలో గౌరవించకపోవడం కూడా ఆయనలో అసంతృప్తికి కారణమని మరికొందరు అంటున్నారు.