Begin typing your search above and press return to search.

క‌న్ఫ‌ర్మ్:ఆ కేంద్ర‌మంత్రి ప‌ద‌వీ ఊడ‌నుంది

By:  Tupaki Desk   |   11 Oct 2018 12:58 PM GMT
క‌న్ఫ‌ర్మ్:ఆ కేంద్ర‌మంత్రి ప‌ద‌వీ ఊడ‌నుంది
X
మీటూ మూవ్‌ మెంట్ ఊహించ‌ని మలుపులు తిరుగుతోంది. ఇన్నాళ్లూ సినీ ఇండస్ట్రీకి చెందిన మహిళలే తమపై జరిగిన లైంగిక దాడుల గురించి బయటకు వెల్లడించారు. తాజాగా పలువురు జర్నలిస్టులు ఏకంగా కేంద్ర మంత్రి - మాజీ ఎడిటర్ ఎంజే అక్బర్‌ పై లైంగిక ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఆయన విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. పలువురు జర్నలిస్టుల నుంచి లైంగిక వేధింపుల‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజే అక్బర్‌ ను కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనపై త్వరలోనే పెద్ద నిర్ణయం వెలువడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న అక్బ‌ర్ పత్రిక ఎడిటర్‌ గా ఉన్న సమయంలో తమకు లైంగికంగా వేధించారంటూ ఐదుగురు మహిళలు ఆరోపించారు. మీటూ ఉద్యమం ఇండియాలో ఉధృతంగా సాగుతున్న సమయంలో జర్నలిస్టులు తమ మాజీ బాస్ - ప్రస్తుతం కేంద్ర మంత్రిపై లైంగిక ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో ఉన్న అక్బర్.. ఇప్పటివరకు ఈ ఆరోపణలపై స్పందించలేదు. దీంతో మంత్రివర్గం నుంచి తనకు తానుగా తప్పుకోవాలని అక్బర్‌కు సూచించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2014 ఎన్నికలకు ముందు అక్బర్ బీజేపీలో చేరారు. ఏడాది తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. అంతర్జాతీయ వేదికలపై తమది మహిళల పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకుంటున్న సమయంలో ఇలాంటి వ్యక్తి కేబినెట్‌లో ఉండటం మంచి కాదని మోడీ సర్కార్ భావిస్తున్నది. ఎంజే అక్బర్‌ పై తొలిసారి ప్రియా రమణి అనే జర్నలిస్ట్ ఈ లైంగిక దాడి ఆరోపణలు చేశారు.

కాగా, అక్బ‌ర్‌ అంశంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందన కోరగా.. ఆమె ఏమీ పట్టనట్లు వెళ్లిపోవడం గమనార్హం. ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలు.. ఇవి లైంగిక ఆరోపణలు. మీరు ఆయన శాఖకు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఈ ఆరోపణలపై విచారణ ఉంటుందా అని ట్రిబ్యూన్ రిపోర్టర్ ప్రశ్నించగా.. సుష్మా మాత్రం స్పందించకుండా వెళ్లిపోయారు.