Begin typing your search above and press return to search.

నాడు అమ్మకు.. నేడు స్టాలిన్ కు..

By:  Tupaki Desk   |   18 Feb 2017 2:06 PM GMT
నాడు అమ్మకు.. నేడు స్టాలిన్ కు..
X
దాదాపు 28 ఏళ్ల కిందట మాట. 1989లో తమిళనాడు శాసనసభలో జరిగిన ఆ ఘటన కానీ జరిగి ఉండకపోతే.. తమిళనాడు రాజకీయాలు కచ్ఛితంగా మరోలా ఉండేవి. ఇన్నేళ్ల తర్వాత.. ఇవాల్టి రోజున నాడు జరిగిన ఉదంతాన్ని చప్పున గుర్తు చేసే ఉదంతం చోటు చేసుకోవటం విశేషంగా చెప్పాలి. నాడూ.. నేడూ విపక్ష నేతకు అసాధారణ అవమానం చోటు చేసుకుందని చెప్పాలి. ఇంతకీ నాడేం జరిగింది.. నేడేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

నాడు జరిగిందేమిటంటే..

1989లో జయలలిత విపక్షంలో ఉన్నారు. అసెంబ్లీ సమావేశంలో డీఎంకే ఎమ్మెల్యే ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించారని.. చీరపట్టుకు లాగిన వైనం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తనకు అవమానం జరిగిన సభలోకి తాను మళ్లీ అడుగు పెట్టనని.. సీఎంగానే అడుగు పెడతానని శపధం చేసిన జయ.. చెప్పినట్లే 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కట్టి సీఎం అయ్యారు. అమ్మ పట్ల అనుచితంగా వ్యవహరించిన ఆమె చీర లాగి.. అవమానించిన తీరు తమిళుల్ని విపరీతంగా కదిలించటమే కాదు సానుభూతి వరదలా పారింది.

ఇవాళ జరిగిందేమిటి?

గడిచిన పన్నెండు రోజులుగా అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత సంక్షోభానికి ముగింపుగా.. ఈ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పళని స్వామి బలనిరూపణ పరీక్షకు సిద్ధమయ్యారు. ఈసందర్భంగా సభలో రహస్య ఓటింగ్ నిర్వహించాలని డీఎంకే నేతలు స్పీకర్ ను కోరారు. అందుకు నో చెప్పేశారు స్పీకర్ ధనపాల్. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన డీఎంకే సభ్యులు.. స్పీకర్ పోడియం వైపుకు దూసుకెళ్లి.. విద్వంసం సృష్టించటమే కాదు.. స్పీకర్ ను పట్టుకొని లాగినట్లుగా.. చొక్కాను చించినట్లుగా ఆయన ఆరోపించారు. తనకు జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలంటూఆవేదనతో ప్రశ్నించారు. దీంతో డీఎంకే వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఇక్కడే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే సభ్యుల వైఖరిని తప్పు పడుతూ వారందరిపైనా సస్పెన్షన్ వేటు వేస్తూ.. సభ నుంచి బయటకు పంపాలంటూ మార్షల్స్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారిని క్లియర్ చేసే క్రమంలో మార్షల్స్ డీఎంకే ఎమ్మెల్యేలతో పాటు స్టాలిన్ ను ఎత్తేశారు. ఆయన్న బయటకు తీసుకెళ్లిన తీరు.. ఈ సందర్భంగా వారు వ్యవహరించిన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్షల్స్ తీరుతో ఆయన చొక్కా చినిగిపోవటంతో.. విపక్ష నేత పట్ల మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. విపక్ష నేత అంటే క్యాబినెట్ ర్యాంకు ఉన్న వ్యక్తి అన్నది మర్చిపోకూడదు. ఆయనకు రాజ్యాంగపరంగా ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాల్సి ఉంటంది. అలాంటిదేమీ లేకుండా దురుసుగా ఆయన పట్ల వ్యవహరించిన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

తాజాగా చోటు చేసుకున్న పరిణామంపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమేకాదు.. కారులో నుంచి దిగి.. చిరిగిన తన చొక్కాను చూపించటమే కాదు.. రెండు చేతులు పైకెత్తి దండం పెడుతూ.. ఇంతలా చేస్తారా? అన్నట్లుగా ఆయన ఆవేదన వ్యక్తం చేయటం కనిపిస్తుంది. నాడు చీరను పట్టుకున్న అమ్మకు సభలో అవమానం జరిగితే.. అంత స్థాయిలో కాకున్నా.. విపక్ష నేతగా ఉన్న స్టాలిన్ ను మార్షల్స్ ఎత్తేసుకెళ్లి.. చొక్కా చినిగిపోయేలా వ్యవహరించిన వైనం చూసినప్పుడు చరిత్ర పునరావృతం అయ్యిందా? అన్న భావన కలగటం ఖాయం. మరి.. నాడు అమ్మకు జరిగిన అవమానంపై తమిళుల్లో వెల్లువెత్తిన సానుభూతి.. స్టాలిన్ మీద కూడా పొంగి పొర్లుతుందా? అన్నదే ఇప్పుడు ప్రశ్నగా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/