Begin typing your search above and press return to search.

ఇరాక్ లో రాముడి ఆన‌వాళ్లు అలా దొరికాయ‌ట‌!

By:  Tupaki Desk   |   27 Jun 2019 5:07 AM GMT
ఇరాక్ లో రాముడి ఆన‌వాళ్లు అలా దొరికాయ‌ట‌!
X
ఆఖండ్ భార‌త్ అన్న మాట సంఘ్ ప‌రివార్ స‌భ్యుల నోటి నుంచి త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. భార‌త ఉప ఖండంతో పాటు.. ఆఫ్ఘ‌నిస్తాన్.. ఇరాక్.. త‌దిత‌ర‌దేశాల సమాహారం అఖండ భార‌త్ కింద‌కే వ‌స్తుంద‌న్న మాట‌ను వారు వినిపిస్తుంటారు. ఒక‌ప్పుడు ఈ ప్రాంతమంతా హిందూదేశంగా ఉండేద‌న్న మాట‌ను కొంద‌రు చెబుతుంటారు. ప్ర‌స్తుతం ముస్లిం దేశ‌గా సుప‌రిచిత‌మైన ఇరాక్ కూడా కొన్ని వంద‌ల ఏళ్ల క్రితం భార‌త్ లోనే భాగంగా చెప్పే వారు లేక‌పోలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఇరాక్ లో రాముడి ఆన‌వాళ్ల‌ను గుర్తించారు. దాదాపు 2వేల ఏళ్ల క్రితానికి చెందిన‌విగా చెబుతున్న ఈ ఆధారాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. హురెన్ షెకాన్ ప్రాంతంలోని ద‌ర్బాంద్ ఇ బెలుల కొండ‌రాళ్ల‌పై రాముడు పోలిన చిత్రాల్ని గుర్తించారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి ఇరాక్ వెళ్లిన అయోధ్య శోధ్ సంస్థాన్ బృందం కొండల‌పై చిత్రాల్ని గుర్తించారు. అందులో ఒక‌టి రాముడు విల్లు ప‌ట్టుకున్న‌ట్లున్న‌ట్లుగా.. మ‌రొక‌టి మారుతి రూపంలో ఉంద‌ని చెబుతున్నారు. ప్రాచీన కాలంలో అత్యున్న‌త నాగ‌రిక‌త‌లుగా పేర్కొందిన సింధు.. మెస‌ప‌టోమియా నాగ‌రిక‌త‌ల మ‌ధ్య సంబంధాల్ని వీటి ద్వారా గుర్తించే వీలు ఉంటుంద‌ని చెబుతున్నారు.

తాజాగా బ‌య‌ట‌ప‌డ్డ చిత్రాలు ఆయా ప్రాంతాల‌కు చెందిన రాజుల‌వై ఉంటాయ‌ని ఇరాక్ చ‌రిత్రకారులు చెబుతున్నారు. అందుకు భిన్నంగా ఆ చిత్రాలు రాముడి ఆన‌వాళ్లుగా భావిస్తున్నారు. మ‌రిన్ని ప‌రిశోధ‌న‌ల‌తో మ‌రికొన్ని కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వచ్చే వీలుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.