Begin typing your search above and press return to search.

కాఫీతో న‌డుస్తున్న లండ‌న్ బ‌స్సులు

By:  Tupaki Desk   |   21 Nov 2017 5:53 AM GMT
కాఫీతో న‌డుస్తున్న లండ‌న్ బ‌స్సులు
X
ఔను. డీజిల్ తోనే విద్యుత్‌ తోనో కాకుండా అచ్చంగా కాఫీతో బస్సులు నడుస్తున్నాయి...ఇదేదో పొరపాటున రాశారనుకోకండి. మీరు చదివింది అక్షరాల నిజమే. లండన్‌ లో కాఫీ ఆధారంగానే బస్సులు తిరిగేస్తున్నాయట. జీవ ఇంధనం (బయో ఫ్యూయల్) తయారీలో కాఫీ గింజల వ్యర్థాలనూ (వేస్టేజ్) వినియోగిస్తుండగా, తొలిసారిగా ఇలా వచ్చిన ఇంధనంతో సోమవారం ఇక్కడి కొన్ని బస్సులు పరుగులు తీశాయని బీబీసీ తెలియజేసింది. ఈ కాఫీ ఆయిల్‌ ను టెక్నాలజీ సంస్థ బయో-బీన్ ఉత్పత్తి చేస్తోంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను నియంత్రించడంలో భాగంగా లండన్ రవాణా శాఖ.. జీవ ఇంధన వినియోగాన్ని క్రమేణా పెంచుతోంది. ఇప్పటికే వంట నూనెలు - మాంసం తయారీలో వస్తున్న వ్యర్థాల ద్వారా తయారుచేస్తున్న బయో ఫ్యూయల్‌ తో లండన్ నగరంలో 9,500 బస్సులు నడుస్తున్నాయి. తాజాగా ఇప్పుడు కాఫీ గింజల పిప్పితో తయారైన బయో ఫ్యూయల్‌ నూ బస్సుల ఇంధనంగా వాడటం మొదలుపెట్టారు.

లండన్‌ లో ఏటా 2 లక్షల టన్నుల కాఫీ వృథా అవుతున్నదని బయో-బీన్ చెబుతుండగా, కాఫీ షాపుల నుంచి ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ తయారుచేస్తున్న కర్మాగారాల నుంచి పిప్పిని సేకరిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. దీన్ని బి20 బయో ఫ్యూయల్‌ గా మారుస్తున్నామని, డీజిల్‌ తో మిళితం చేసిన ఈ ఇంధనం వినియోగానికి బస్సు ఇంజిన్లలో ఎలాంటి మార్పులు చేయనవసరం లేదని కూడా స్పష్టం చేసింది. 25 లక్షల 50 వేల కప్పుల కాఫీ వ్యర్థాలతో ఒక బస్సుకు ఏడాదికి సరిపడా ఇంధనం తయారవుతుందని పేర్కొంది. ఇప్పటిదాకా ఆరు వేల లీటర్ల కాఫీ ఆయిల్‌ ను ఉత్పత్తి చేసినట్లు వివరించింది.