Begin typing your search above and press return to search.

బాబు ప్ర‌ధాని కాకుండా అడ్డుకున్న లోకేష్‌!

By:  Tupaki Desk   |   29 May 2016 9:46 AM GMT
బాబు ప్ర‌ధాని కాకుండా అడ్డుకున్న లోకేష్‌!
X
ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి అవ‌కాశం వ‌స్తే వ‌ద్ద‌నుకునే నాయ‌కుడు, అలా చేసే వారి కుటుంబ స‌భ్యులు ఉంటారా? కానీ ఉన్నార‌ని అదీ తెలుగు రాజ‌కీయాల్లోనేది తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నోటి వెంట ఈ నిజం తెలిసింది. తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టకుండా కుమారుడు లోకేష్ అడ్డుకున్నారని చంద్ర‌బాబు స్వ‌యంగా వెల్ల‌డించారు.

తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో భాగంగా చంద్రబాబునాయుడు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ ఆస‌క్తిక‌ర‌మైన‌ విషయాన్ని చెప్పారు. జాతీయ రాజ‌కీయాల గురించి వివ‌రిస్తున్న స‌మ‌యంలో చంద్ర‌బాబు పాతికేళ్ల నాటి ప‌రిస్థితుల‌ను నెమ‌రువేసుకున్నారు. 1990లలో సీపీఏం అగ్రనేత జ్యోతి బసు సహా మూడో కూట‌మి నాయకులందరూ తనను ప్రధాని పదవి చేపట్టాల్సిందిగా కోరిన సంద‌ర్భాన్ని చంద్ర‌బాబు గుర్తుచేశారు.

ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చిన స‌మ‌యంలో లోకేష్ త‌న‌తో #నాన్నా ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌వద్దు. అది తాత్కాలికం మాత్రమే# అని వారించినట్లు చంద్రబాబునాయుడు వివ‌రించారు. అప్పట్లో టెన్త్ చదువుతున్న లోకేష్ ఎంతో పరిణితితో ఆలోచించి, భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రధాని పదవి చేపట్టవద్దని సూచించాడని బాబు తెలిపారు. అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్ ప్ర‌భుత్వం ఏర్పడటంతో తెలుగుదేశం నాయకులం అందరం ఎంతో కృషి చేశామని చెప్పిన ఫ్రంట్ లో పలువురు నేతలు తనను ప్రధాని పదవి చేపట్టాల్సిందిగా ఒత్తిడి చేశారని ఆనాటి ప‌రిస్థితుల‌ను గుర్తుచేశారు.