Begin typing your search above and press return to search.

నాన్నకు చెడ్డ పేరు తేనంటున్న లోకేశ్

By:  Tupaki Desk   |   29 May 2016 10:29 AM GMT
నాన్నకు చెడ్డ పేరు తేనంటున్న లోకేశ్
X
తిరుపతిలో జరుగుతున్న మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ మాట్లాడారు. అయితే.. ఆయన తాజా ప్రసంగం ఆత్మరక్షణ విధానంలో సాగటం గమనార్హం. ఇటీవల కాలంలో ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియాలో పరోక్షంగా చంద్రబాబు కుమారుడి ప్రస్తావన తీసుకొస్తూ వార్తలు అచ్చేయటం కనిపిస్తోంది. దీని ప్రభావం లోకేశ్ మీద పడినట్లుగా తాజాగా ఆయన మాటల్ని చూస్తే అర్థమవుతుందని చెప్పాలి. మహానాడులో ప్రసంగించిన లోకేశ్.. జగన్ మాదిరి తన చేష్టలతో తన తండ్రికి చెడ్డపేరు తీసుకురానని స్పష్టం చేశారు.

తనపై జగన్ పార్టీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన.. తన మీద చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కదానినైనా నిరూపిస్తే తాను నేరుగా వెళ్లి జైల్లో కూర్చుంటానని వ్యాఖ్యానించటం గమనార్హం. జగన్ పార్టీ నేతలకు దమ్ము.. ధైర్యం ఉంటే తనపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్క దానినైనా నిరూపించగలరా అని సవాలు విసిరారు.

తన మీద వస్తున్న ఆరోపణల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన లోకేశ్.. అదే సమయంలో ఏపీ విపక్ష నేత జగన్ తీరుపైనా మండిపడ్డారు. తుని రైలు దగ్థం కేసులో జగన్ హస్తం ఉందన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన ఆయన.. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉందని.. త్వరలోనే అసలు నిందితుల్ని అదుపులోకి తీసుకుంటారన్నారు. తెలంగాణలో టీడీపీని కావాలనే ఇబ్బంది పెడుతున్నట్లుగా వ్యాఖ్యానించిన లోకేశ్.. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన దారుణ అవమానాన్ని కవర్ చేసుకున్న తీరు కాస్త భిన్నంగా ఉందని చెప్పాలి.

మొత్తం 150 గ్రేటర్ స్థానాల్లో ఒక్కస్థానంలో మాత్రమే టీడీపీ అభ్యర్థి విజయం సాధించగా.. లోకేశ్ చెప్పిన లెక్కలు మాత్రం కాస్త చిత్రంగానే ఉన్నాయని చెప్పాలి. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ తర్వాత అత్యధిక ఓట్లు తెలుగుదేశం పార్టీకి మాత్రమే వచ్చినట్లుగా ఆయన పేర్కొనటం గమనార్హం. ఓట్లు ఎన్ని వచ్చినా.. సీట్ల గెలుపులోనే అంతా ఉంటుందన్న విషయం లోకేశ్ కు తెలియంది కాదు. ఇక.. తన మీద వచ్చిన ఆరోపణలపై జగన్ కు విసిరిన సవాలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పకతప్పదు.