Begin typing your search above and press return to search.

సీన్ రిపీట్‌: టేబుల్ మీద తీర్మానం.. స‌భ వాయిదా

By:  Tupaki Desk   |   21 March 2018 8:50 AM GMT
సీన్ రిపీట్‌: టేబుల్ మీద తీర్మానం.. స‌భ వాయిదా
X
మ‌రోసారి సీన్ రిపీట్ అయ్యింది. కొంద‌రి ప్ర‌యోజ‌నాలు చెల్లుబాటు అయ్యేలా ఈ రోజూ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌త్యేక హోదాతో పాటు విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల అమ‌లుపై త‌మ‌కున్న అభ్యంత‌రాల‌తో పాటు.. మోడీ స‌ర్కారు తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ ఏపీ అధికార టీడీపీ.. విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నాలుగోసారి ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే స‌భ వాయిదా ప‌డింది.

ఇప్ప‌టికే మూడుసార్లు ఏ విధంగా స‌భ వాయిదా ప‌డిందో.. స‌రిగ్గా అదే రీతిలో ఈ రోజూ అలాంటి ప‌రిణామాలే చోటు చేసుకున్నాయి. ఎప్ప‌టిలానే వైఎస్సార్ కాంగ్రెస్‌.. టీడీపీ ఎంపీలు మోడీ స‌ర్కారుపై అవిశ్వాసం వ్య‌క్తం చేస్తూ నోటీసులు ఇచ్చాయి. వీటిని స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ప్ర‌స్తావించారు. స‌భ ప్రారంభం కాగానే ఏపీకి చెందిన రెండు పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని చ‌ర్చ‌కు రానున్నట్లు చెప్పారు. అంత‌లోనే కావేరీ అంశంపై అన్నాడీఎంకే నేత‌లు.. రిజ‌ర్వేష‌న్ల అంశంపై టీఆర్ఎస్ నేత‌లు వెల్ లోకి దూసుకెళ్లారు. త‌మ డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం నెర‌వేర్చాలంటూ డిమాండ్ చేశారు.

దీంతో స‌భ నిర్వాహ‌ణ ఇబ్బందిక‌రంగా ఉంద‌న్న స్పీక‌ర్‌.. వెల్ లోకి వ‌చ్చిన అన్నాడీఎంకే.. టీఆర్ ఎస్ ఎంపీలు త‌మ డిమాండ్ల సాధ‌నకు అనుకూలంగా నినాదాలు చేయ‌టం షురూ చేశారు. స‌భను గంట‌పాటు వాయిదా వేసిన స్పీక‌ర్ త‌ర్వాత స‌భ‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌కు తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లుగా అనంత్ కుమార్ చెప్పారు. అయితే.. వెల్ లోకి దూసుకెళ్లిన టీఆర్ ఎస్‌.. అన్నాడీఎంకే నేత‌లు నిర‌స‌న‌ను ముమ్మ‌రం చేశారు. దీంతో స‌భ‌ను స‌జావుగా నిర్వ‌హించ‌లేమంటూ లోక్ స‌భ స్పీక‌ర్ స‌భ‌ను వాయిదా వేశారు. దీంతో.. అవిశ్వాసంపై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా స‌భ వాయిదా ప‌డ‌టం ఇది నాలుగోసారిగా మారింది.