Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియాతో ఆధార్ లింక్‌..దేశ భ‌ద్ర‌త‌కు ముప్పేగా..?

By:  Tupaki Desk   |   21 Aug 2019 5:30 PM GMT
సోష‌ల్ మీడియాతో ఆధార్ లింక్‌..దేశ భ‌ద్ర‌త‌కు ముప్పేగా..?
X
పుట్టినా... చ‌చ్చినా.. ఏం కావాలంటే.. ఒక‌ప్పుడు డ‌బ్బులు కావాల‌నే స‌మాధానం బాగా వినిపించేది. కానీ, ఇప్పుడు దీనికి ఆధార్ కూడా తోడైంది! అవును. వ్య‌క్తి పుట్టినా.. మ‌ర‌ణించినా.. ఆధార్ లేకుండా ఏ ప‌నీ జ‌ర‌గ‌డం లేదు. బ్యాంక్ పాస్ బుక్ నుంచి సెల్ ఫోన్ సిమ్ వ‌ర‌కు ఆధార్ లేకుండా ప‌నిజ‌ర‌గ‌దు. అందుకే జేబులో డ‌బ్బులు లేక పోయినా ఫ‌ర్లేదు కానీ... ఆధార్ కార్డు మాత్రం పెట్టుకో..! అంటూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేవారికి ఇంట్లోని వారు చెబుతున్న మాట!! ఇలా నిత్య జీవితంతో అంత‌గా పెన‌వేసుకుపో యిన ఆధార్‌పై మ‌రో వివాదం ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చింది.

నిత్యం ప్ర‌జ‌ల‌కు చేరువైన సోష‌ల్ మీడియాకు ఆధార్‌ ను లింకు చేయాల‌నే డిమాండ్లు పెరుగుతున్నాయి. చేతిలోని స్మార్ట్ ఫోన్ .. స‌క‌ల ప్ర‌పంచాన్నీ ప్ర‌జ‌ల‌కు చేరువ చేసింది. యూట్యూబ్ స‌హా సోష‌ల్ సైట్ల‌న్నీ అర‌చేతిలోనే ప్ర‌జ‌ల‌కు స‌క‌ల చ‌రాచ‌ర విశ్వాన్ని క్ష‌ణాల్లో చూపిస్తున్నాయి. ఎక్క‌డ ఏం జ‌రిగినా సెక‌న్ల వ్య‌వ‌ధిలో ఆవిష్క‌రిస్తున్నాయి. అయితే, ఈ సోష‌ల్ మీడియాతో ప్ర‌జ‌ల‌కు ఎంత మంచి జ‌రుగుతోందో.. అదేస‌మయంలో అనేక ప్రాంతాల్లో సోష‌ల్ మీడియా కార‌ణంగా అనేక నేరాలు - ఘోరాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మంచి జ‌రిగితే.. ఎవ‌రూ కాద‌నరు. కానీ, చెడు జ‌రుగుతున్నందునే.. దీనికి ఆధార్‌ను లింకు చేయాల‌నే డిమాండ్లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

ముఖ్యంగా త‌మిళ‌నాడులో ఇలాంటి ప‌రిస్థితి ఎక్క‌గా ఉంది. ఈ నేప‌త్యంలోనే అక్క‌డి ప్ర‌భుత్వమే ఏకంగా సోష‌ల్ మీడియాతో ఆధార్‌ ను లింకు చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చి.. ఏకంగా మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ క్ర‌మంలోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ - బొంబాయి హైకోర్టుల్లో ప‌లు ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాలు కూడా న‌మోద‌య్యాయి. ఆధార్‌ ను లింకు చేసే విష‌యంపై పెద్ద ఎత్తున ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా కూడా మారింది. ఈ నేప‌థ్యంలో ఆధార్‌ ను లింకు చేసే విష‌యం కోర్టు ప‌రిధిలోకి వెళ్లింది. ఇదిలావుంటే - అస‌లు ఇది సాధ్య‌మేనా? అనే సందేహం కూడా తెర‌మీదికి వ‌స్తోంది.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. సోష‌ల్ మీడియాలో కీల‌కంగా ఉన్న ట్విట్ట‌ర్‌ - ఫేస్‌ బుక్‌ - వాట్సాప్‌ - యూట్యూబ్ వంటివ‌న్నీ కూడా మ‌న దేశానికి సంబంధించినవి కావు. విదేశీ సంస్థ‌లే వీటిని న‌డుపుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పౌరుల హ‌క్కుగా సంక్ర‌మించిన ఆధార్‌ను వీటికి లింకు చేయ‌డం వ‌ల్ల వ్య‌క్తిగ‌త వివ‌రాలు పొరుగు దేశాల వారికి తెలిస్తే. పౌరుల భ‌ద్ర‌త‌, అంత‌కు మించి దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్ల‌దా? అని మేధావులు వాపోతున్నారు. అయితే, దీనిపై కోర్టులు ఎలాంటి పరిష్కారం చూపుతాయో ? చూడాలి.